ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు శనివారం నాడు.. మిజోరాం మొట్టమొదటి రైల్వే లైన్‌ని ప్రారంభించారు. బైరాబీ-సైరాంగ్ బ్రాడ్-గేజ్ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం దీన్ని జాతికి అంకితం చేశారు. ఇది మిజోరాం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అన్నారు మోదీ. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 8,070 కోట్లు ఖర్చు చేశారు. ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే కాక ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్డుల్లోకెక్కింది. 51.38 కి.మీ. పొడవైన ఈ రైల్వే లైన్.. 45 భారీ సొరంగాలు, 153 బ్రిడ్జిలను కలిగి ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం రూ. 8,070 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఒక్క కిలోమీటర్ నిర్మాణం కోసం రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో ఒక కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు రూ.13-రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఈ రైల్వే లైన్ నిర్మాణంలో మాత్రం ఖర్చు.. సాధారణంగా ఒక కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు కన్నా పది రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
11 ఏళ్ల తర్వాత అందుబాటులోకి
ఈ ప్రాజెక్టును 2008-09లో మొదలుపెట్టారు. 2015లో దీని నిర్మాణం ప్రారంభించారు. ఈ సంవత్సరం అనగా 11 ఏళ్ల తర్వాత ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో 45 సొరంగాలు, 55 పెద్ద వంతెనలు, 88 చిన్న వంతెనలు ఉన్నాయి. ఇంకా పది ఆర్‌యూబీలు, అండర్‌పాస్‌లు కూడా ఉన్నాయి. ఈ రైలు మార్గం దాదాపు 54 శాతం సొరంగాలు, వంతెనల మీదుగా వెళుతుంది. ఈ మార్గంలో సైరాంగ్ దగ్గర ఉన్న వంతెన నంబర్ 144 చాలా ప్రత్యేకమైనది. ఇది 114 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తుగా ఉంటుంది. 114 మీటర్ల ఎత్తులో సింగిల్ పిల్లర్‌పై నిర్మించిన బ్రిడ్జిగా ఇది గుర్తింపు పొందింది. భూకంపాలు, భారీ ప్రవాహాలను తట్టుకొని నిలబడేలా పటిష్టంగా ఈ రైల్వే లైన్‌ని నిర్మించారు.
ఈ రైల్వే లైన్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ ఖర్చుకు కారణం అని తెలిపారు అధికారులు. ఈ రైల్వే లైన్ నిర్మించిన ప్రాంతంలో ఒకదాన్ని ఒకటి ఆనుకుని.. భారీ కొండలు ఉంటాయి. వాటిని తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా.. లోయలు ఉండటంతో.. సొరంగాలకు సమాంతరంగా బ్రిడ్జిలు నిర్మించి దాని మీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు ఆరుచోట్ల అతి ఎత్తైన పిల్లర్లు నిర్మించాల్సి వచ్చింది. ఇందుకోసం 70-114 మీటర్ల ఎత్తున్న పిల్లర్లు నిర్మించి..ఆపై వాటిని కలుపుతూ నిర్మించిన ఆ బ్రిడ్జిలను చూస్తే ఇంజనీర్ల ఎంత శ్రమించారో అర్థం అవుతుంది.
ఈ ప్రాజెక్టులో నాలుగు కొత్త స్టేషన్లు కూడా ఉన్నాయి. అవిహోర్టోకి, కవ్న్‌పుయి, ముయాల్‌ఖాంగ్, సైరాంగ్. ఈ స్టేషన్లు ఆ ప్రాంతాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐజాల్‌కు మొదటి రైలు లింక్ అయిన ఈ మార్గం మిజోరాం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం అస్సాం-మిజోరాం సరిహద్దులోని బైరాబీ నుంచిసైరాంగ్‌ను కలుపుతుంది. సైరాంగ్.. ఐజాల్ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రైలు మార్గం ప్రారంభంతో మిజోరాం రాజధాని ఐజాల్ మొదటిసారిగా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో నేరుగా కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.
భారతీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డామని తెలిపారు. హిమాలయాల వంటి కొండ ప్రాంతాలు, క్లిష్టమైన భూభాగం కారణంగా పనులు ఆలస్యమయ్యాయి అని చెప్పుకొచ్చారు. ఇంజనీర్లు సొరంగాలు తవ్వడానికి ఎంతో శ్రమించారని.. వినూత్న రీతుల్లో ఈ పనులు ముగించారని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే దేశంలో మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాలుండగా.. వీటిల్లో ఒక్క సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. మిగతా ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా రైల్వే లైను అందుబాటులో ఉంది. కానీ మిజోరం, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. కానీ బైరాబీ-సైరాంగ్ వల్ల మిజోరం రాజధాని ఐజాల్‌కు రైల్వే కనెక్టివిటీ లభించింది. త్వరలోనే మిగతా వాటిని కూడా కనెక్ట్ చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa