ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యాపిల్లల్ని వదిలేసి మరదలితో వెళ్లిపోయిన వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 07:47 PM

దేశంలో గత కొన్నేళ్లుగా వెలుగుచూస్తున్న సంఘటనలు వివాహ వ్యవస్థకు కళంకం తీసుకొచ్చేలా ఉన్నాయి. ఇక వావివరసలు పట్టించుకోకుండా కొంతమంది యువతీయువకులు, పురుషులు మహిళలు.. పెట్టుకుంటున్న సంబంధాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెళ్లి చేసుకునే వరస లేకపోయినా సరే.. కుటుంబ సభ్యులు వద్దంటారని ముందే గ్రహించి.. ఇళ్లల్లో నుంచి పారిపోయి పెళ్లిళ్లు చేసుకోవడం, కలిసి సహజీవనం చేయడం చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లు అయి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వారిని వదిలేసి.. ప్రేమించినవారితో పారిపోతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట మరదలితో బావ పారిపోగా.. ఆ మరుసటి రోజే బామ్మర్దితో చెల్లి వెళ్లిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన ఓ టీవీ సీరియల్ డ్రామాకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటం గమనార్హం.


యూపీలోని బరేలీ జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. పెళ్లి అయి, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి.. భార్యను కాదని ఆమె చెల్లితో పారిపోయాడు. ఆ తర్వాతి రోజే అతని బావమరిది.. బావ సోదరితో పారిపోయాడు. ఈ రెండు సంఘటనలు ఆ రెండు కుటుంబాలను తీవ్ర ఆశ్చర్యంలో పడేశాయి. చివరికి ఆ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారి జోక్యంతో రాజీ పడటంతో ఎలాంటి చట్టపరమైన చర్యలు, కేసులు తీసుకోలేదు.


బరేలీ జిల్లాలోని దేరానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలుపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 28 ఏళ్ల కేశవ్ కుమార్‌కు 6 ఏళ్ల క్రితం వివాహం అయింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే గత నెల 23వ తేదీన కేశవ్ కుమార్.. తన భార్య చెల్లి అయిన 19 ఏళ్ల కల్పనతో పారిపోయాడు. ఈ విషయం తెలిసి.. ఆ రెండు కుటుంబాలు అవాక్కయ్యాయి. అయితే ఆ మరుసటి రోజే.. కేశవ్ కుమార్ భార్య సోదరుడైన 22 ఏళ్ల రవీంద్ర.. కేశవ్‌ కుమార్‌ 19 ఏళ్ల చెల్లెలితో కలిసి పారిపోయాడు. రెండు రోజుల్లో జరిగిన రెండు వరుస సంఘటనలతో ఆ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.


ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రెండు కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ నెల 14, 15 తేదీల్లో రెండు ఆ జంటలను పట్టుకుని కుటుంబ సభ్యుల ముందు కూర్చోబెట్టారు. ఇక రెండు జంటలను తీసుకువచ్చిన తర్వాత.. పోలీస్ స్టేషన్‌కు రెండు కుటుంబాలను పిలిపించి వారితో పోలీసులు మాట్లాడారు. రెండు కుటుంబాల సభ్యులు, గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో ఒక అసాధారణమైన తీర్పును ఇచ్చారు.


ప్రేమించి ఇష్టంతో పారిపోయిన జంటలను విడగొట్టకుండా.. వారిని అంగీకరించేందుకు ఇరు కుటుంబాలు సమ్మతం తెలపడంతో కథ సుఖాంతమైంది. దీంతో రెండు కుటుంబాలకు చెందిన వారు ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదులు చేయలేదని పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ కేసును మూసివేసినట్లు తెలిపారు. ఈ విచిత్రమైన ఘటన ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa