ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైలట్లే స్విచ్చాఫ్ చేశారనడం దురదృష్టకరం.. విమాాన ప్రమాద నివేదికపై సుప్రీంకోర్టు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 07:00 PM

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పైలట్ల తప్పిదాలు ఉన్నాయన్న విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ ప ఊహాజనిత కథనాలు అత్యంత దురదృష్టకరం, బాధ్యతరాహిత్యం అని వ్యాఖ్యానించింది. విమాన ప్రమాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, డీజీసీఏ, ఏఏఐబీలకు నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. స్పందన తెలియజేయాలని కోరింది.


జూన్‌ 12న అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టెకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. అయితే, టేకాఫ్ అయిన తర్వాత ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోయినట్లు ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. ఎందుకు స్విచ్చాఫ్ చేశావని కెప్టెన్‌ను కో- పైలట్‌ ప్రశ్నించగా.. తాను స్విచ్ఛాఫ్‌ చేయలేదని సమాధానం ఇచ్చినట్టు నివేదిక వివరించింది. కాక్‌పిట్‌లో పైలట్ల చివరి మాటలు ఇవేనని, రెండు ఇంజిన్లు సెకను తేడాతో ఒకదాని తర్వాత మరొకటి ఆగిపోయాయని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోందని, ప్రమాదానికి గల అసలు కారణాలు, సిఫార్సులతో త్వరలోనే తుది నివేదికను వెలువరిస్తామని చెప్పింది.


ఈ నివేదిక అనంతరం అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. పైలట్ ఉద్దేశపూర్వకంగానే ఇంజిన్ స్విచ్ఛాఫ్ చేశారంటూ ఊహాజనిత కథనాలు వెలువరించాయి. అయితే, ఈ చర్యలను తీవ్రంగా ఖండించిన ఏఏఐబీ.. ఇవి అత్యంత బాధ్యతారాహిత్యమని మండిపడింది. ఈ క్రమంలోనే స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ఏవియేషన్ సేఫ్టీ ఎన్జీఓ మ్యాటర్స్ ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ప్రాథమిక నివేదిక కీలకమైన సమాచారాన్ని దాచిపెట్టిందని, పౌరుల ప్రాథమిక హక్కులైన జీవించడం, సమానత్వం, సమాచారాన్ని పొందే హక్కును ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడించే ఫ్లైట్ డేటా రికార్డర్‌ పరిశీలనకు నిపుణులను అనుమతించాలని కోరింది.


పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషన్ హాజరయ్యారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం ‘‘న్యాయపరమైన, నిష్పాక్షిక దర్యాప్తు పరంగా చూస్తే అది కీలకమే.. కానీ ఆ వివరాలన్నీ బయటపెడితే పాడ్‌కాస్ట్‌లో కొత్త కథనాలు అల్లేస్తారు. పైలట్‌ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఎవరైనా బాధ్యతారాహిత్యంగా అంటే.. అది వారి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకవేళ తుది నివేదికలో పైలట్ల ప్రస్తావన లేకపోతే అప్పుడు ఏం చేస్తాం? ’’ అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో విమానంలోని ఒకరు మినహా ప్రయాణికులు, సిబ్బంది సహా 241 మంది, అది కూలిపోయిన మెడికల్ కాలేజ్ హాస్టల్‌ భవనంలోని 30 మంది ప్రాణఆలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa