ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ .. సంచలన నిర్ణయాలతో అమెరికన్లకే కాకుండా ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే టారిఫ్‌ల పెంపు, వాణిజ్య ఒప్పందాలు, వీసాలపై ఆంక్షలతో ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్‌పై అధిక ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లు (అంటే భారత కరెన్సీలో రూ.88 లక్షలకు) పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయం భారతీయులపైనే అధికంగా ఉంది. 71 శాతం హెచ్-1బీ వీసాలు భారతీయులే పొందుతున్న తరుణంలో ఇప్పుడు ట్రంప్ దెబ్బకు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నిర్ణయంతో.. అమెరికా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి.
హెచ్-1బీ వీసాల విధానంలో మార్పులు తీసుకురావడంతో.. అమెరికన్ కంపెనీలపై పడుతున్న ఒత్తిడి కారణంగా.. తమకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను తీర్చడానికి యూఎస్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఆర్థికవేత్తలు, పరిశ్రమ వర్గాల ప్రకారం.. ఈ వీసా ఆంక్షలు అమెరికా సంస్థలను తమ కీలకమైన, వ్యూహాత్మకమైన పనులను భారత్‌కు తరలించేలా చేస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)లు.. కంపెనీలకు ఇన్ హౌస్ ఇంజిన్‌గా పనిచేస్తుంటాయి. వీసా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి.. వ్యూహాత్మక కార్యకలాపాలను ఔట్‌సోర్సింగ్ చేయకుండా తమ సంస్థలోనే ఉంచుకోవడానికి జీసీసీలకు ఒక పటిష్టమైన కేంద్రంగా భారత్ నిలుస్తోంది. ప్రపంచంలో ఉన్న మొత్తం జీసీసీల్లో సగానికిపైగా భారత్‌లోనే ఉండటంతో ఈ నిర్ణయం మన దేశానికి బాగా ఉపయోగపడనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఫైనాన్స్ వంటి కీలకమైన, అధిక విలువ కలిగిన పనులు జీసీసీలకు తరలిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం జీసీసీల్లో సగానికి పైగా అంటే దాదాపు 1,700 జీసీసీలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఆంక్షలతో ఈ గోల్డ్ రష్ మరింత వేగవంతం అవుతుందని పరిశ్రమ నిపుణుడు లలిత్ అహుజా తెలిపారు.
వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి పెంచినా.. జీసీసీ సేవల ద్వారా ఎగుమతులు పెరగడం వల్ల ఈ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకోవచ్చని నొమురా విశ్లేషకులు ఒక నివేదికలో వెల్లడించారు. అయితే అమెరికాలో ప్రతిపాదించిన హైర్ చట్టం ఆమోదం పొందితే.. విదేశాలకు అప్పగించే పని ఇచ్చే సంస్థలపై 25 శాతం పన్ను విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది భారత సేవల ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నందున.. కొందరు నిపుణులు దీనిపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa