ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానంలో గొడవ.. ఎమ్మెల్యే, ప్రయాణికుడికి వాగ్వాదం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 08:44 PM

ఇటీవలి కాలంలో విమానాల్లో జరుగుతున్న సంఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది పలువురు చేస్తున్న ఘటనలతో విమానాల్లో ప్రయాణించాలంటేనే జనం భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ విమానంలో జరిగిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఓ వ్యక్తి, అందులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడు. మొదట చిన్న చిన్నగానే మొదలైన వారి గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేను.. సదరు వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.


ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూకు మంగళవారం బయల్దేరి వెళ్తున్న ఎయిరిండియాకు చెందిన ఏఐ-837 విమానంలో ఈ ఘటన జరిగింది. ఇక అదే విమానంలో యూపీలోని అమేథీకి చెందిన గౌరీగంజ్ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్‌సింగ్ కూడా ప్రయాణిస్తున్నారు. సమద్ అనే ఒక ప్రయాణికుడు, ఎమ్మెల్యేకు మధ్య తొలుత చిన్న ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోనే సమద్‌ గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు మొత్తం ఏం జరిగిందని అతని వైపు చూశారు.


ఇంతలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్‌సింగ్.. సమద్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఊరుకోలేదు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాకేష్‌ను సమద్ అసభ్య పదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించాడు. ఇక ఈ ఘటన మొత్తం విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత జరిగింది. ఈ ఘటనతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు మొత్తం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక పరిస్థితి తీవ్రంగా మారడంతో కలగజేసుకున్న ఎయిరిండియా విమానయాన సిబ్బంది.. వారి మధ్య గొడవను పరిష్కరించారు.


ఇక ఆ ఎయిరిండియా విమానం లఖ్‌నవూలో ల్యాండ్‌ అయిన తర్వాత సమద్ అనే వ్యక్తిపై ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్‌సింగ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు ఫతేపుర్‌ జిల్లాకు చెందిన సమద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాత ఈ ఘటపై దర్యాప్తు చేయడం ప్రారంభించారు. పౌరులకు వాక్‌ స్వేచ్ఛ ఉంది కదా.. అని ఎవరు పడితే వారు.. ఎవరిని పడితే వారి గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని ఈ ఘటన తర్వాత ఎయిర్‌పోర్టు బయటికి వచ్చిన ఎమ్మెల్యే రాకేష్ మీడియాతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa