ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధ్వాన్నంగా రోడ్లు.. పన్నులు కట్టబోమని జనం వార్నింగ్.. స్పందించిన డిప్యూటీ సీఎం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 08:02 PM

దేశ ఉద్యాననగరి, ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో అధ్వాన్నంగా మారిన రహదారులు, మౌలిక సౌకర్యాలపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షాలకే రాళ్లు తేలి, గుంతులుగా మారుతోన్న రహదారులతో నిత్యనరకం అనుభవిస్తున్నామని మండిపడుతూ.. ఇకపై తాము పన్నులు చెల్లించేది లేదని పౌరులు హెచ్చరికలు చేశారు. దీంతో కర్ణాటక ఉప-ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. బెంగళూరు నగరంలో రహదారులపై గుంతలను పూడ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయని డీకే వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్ట్ చేశారు.


‘‘బెంగళూరు నగరంలో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రాధాన్యత ఇస్తున్నాం.. నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదారులపై తారు వేయడం, గుంతలు పూడ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి’’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. బెంగళూరులో రహదారులు, పారిశుద్ధ్యం గురించి విదేశీ క్లయింట్లు చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం సంచలనంగా మారింది. దీనిపై చర్చ జరుగుతోన్న తరుణంలో డీకే స్పందించారు. బెంగళూరు డెవలప్‌మెంట్ మంత్రి కూడా ఆయనే కావడంతో నగరం నిరంతర విమర్శలకు కాదు, సమిష్టి కృషికి అర్హమైందని చెప్పే ప్రయత్నం చేశారు.


ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాసిన బెంగళూరు నగరంలోని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరమ్.. సరైన మౌలిక వసతులను కల్పించకుంటే గ్రేటర్ బెంగళూరు అధికారులు ఆస్తి పన్ను వసూలు చేయకుండా చూడాలని కోరారు. ‘‘మున్సిపల్ యంత్రాంగం పేలవమైన మౌలిక సదుపాయాల ప్రణాళిక కారణంగా పౌరులు, పన్ను చెల్లింపుదారులు, మా కుటుంబాలు, పిల్లలతో పాటు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. వర్తూర్-బల్గెరె పాణత్తూర్ ప్రాంతంలో కొనసాగుతున్న, సగం కొలతలు కలిగిన, అశాస్త్రీయమైన, సమన్వయం లేని రోడ్ వైట్-టాపింగ్, వరద నీటి పారుదల పనులను మీ దృష్టికీ తీసుకురావాలని భావిస్తున్నాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.


ఇటీవల నగరంలో వచ్చిన అత్యంత తీవ్రమైన వరదలలో ఒకటిగా వర్తూర్‌ను పేర్కొంటూ.. ‘రహదారుల స్థిరత్వానికి ఆధారమైన డ్రెయినేజ్ వ్యవస్థను ముందు పూర్తి చేయకుండా, అధికారులు తొందరపడి వర్తూర్–బళగేరె–పనతూర్ ప్రాంతాల్లో గోతులు పూడ్చి, వైట్‌టాపింగ్ పనులు ప్రారంభించారు.. ఇలాంటి చర్యల వల్ల కొత్త రోడ్లు త్వరగా దెబ్బతింటాయి.. దీని వల్ల ప్రజా నిధులు, పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతుంది’ అని అది పేర్కొంది.


బెంగళూరు నగరంలో రహదారులు, ట్రాఫిక్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మంత్రులు ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్‌లు సైతం సమస్యలను అంగీకరించారు. పరిష్కరించడానికి సమయం, నగరంలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరచేందుకు సమిష్టి కృషి అవసరమని వారు పిలుపునిచ్చారు. ఇక, డీకే శివకుమార్ ఇప్పటి వరకూ నగరంలో 13,000 గుంతలను పూడ్చినట్టు మంగళవారం వెల్లడించారు. అయితే, బెంగళూరు రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగరంలో 550 కి.మీ. రహదారుల అభివృద్ధికి రూ.1100 కోట్ల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa