ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందించే కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీ తిరుపతిలో అందుబాటులోకి రానుంది. తిరుపతి జిల్లా పరిధిలోని 11 డిపోలు, జిల్లా ప్రజా రవాణాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో కలిపి దాదాపు 4,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, ఉద్యోగులు.. ఈ డిస్పెన్సరీ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. అంతేకాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఉద్యోగులతో పాటు పునర్విభజనలో భాగంగా తిరుపతిలో కలిసిన గూడూరు, వెంకగిరి, వాకాడు, సూళ్లూరుపేట డిపోల ఉద్యోగులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 2,000 మంది దాకా ఈ సేవలు పొందొచ్చు.
ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది, కార్మికుల వైద్య పరీక్షల నిమిత్తం.. తిరుపతి బస్‌స్టేషన్ ప్రాంతంలో గతంలో డిస్పెన్సరీని నిర్మించారు. అయితే అది శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇటీవల ఆ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో కొత్త డిస్పెన్సరీ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అక్టోబర్ నెల 30న దీన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు సహా తదితరులు హాజరు కానున్నారు.
అత్యాధునిక సౌకర్యాలతో..
కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే మార్గంలో.. అలిపిరి డిపోకు సమీపంలో ఉన్న ఆర్టీసీ స్థలంలో ఈ కొత్త డిస్పెన్సరీని నిర్మించారు. 1.3 ఎకరాలలో విస్తీర్ణంలో రూ.3.89 కోట్ల వ్యయంతో జీ+3 అంతస్తుల్లో భవన నిర్మాణం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్థలం కేటాయించారు. మొదటి అంతస్తులో వైద్యారోగ్య డిస్పెన్సరీ ఉంటుంది. ఇక రెండు, మూడో అంతస్తుల్లో.. గెస్ట్‌హౌస్ నిర్మించారు. అంతేకాకుండా విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు, రోగుల సౌకర్యార్థం ప్రత్యేక లిఫ్ట్ ఏర్పాటు చేశారు. 50 మందికి పైగా వేచి ఉండేందుకు వీలుగా అన్ని హుంగులతో కూడిన వెయిటింగ్ హాల్ కూడా ఈ డిస్పెన్సరీలో ఉంది. ఇక ఫార్మసీ, ఓపీ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ ఉండే ఇద్దరు వైద్యులకు వేర్వేరుగా గదులు కేటాయించారు.
రూ. 3 లక్షల మందులు ఫ్రీ..
తిరుపతిలో ఇప్పటివరకు ఉన్న ఈ డిస్పెన్సరీలో రోజుకు దాదాపు 100 మంది రోగులకు ఈసీజీతో పరీక్షలు చేసేవారు. దాంతో పాటు సెమీ ఆటోమోటివ్ ఎనలైజర్ ద్వారా 30 రకాల టెస్ట్‌లు చేసేవారు. ఈ డిస్పెన్సరీలో నెలకు రూ. 3 లక్షల వరకు ఉచితంగా మందులు అందజేస్తుండటం గమనార్హం. అయితే ఈ సేవలన్నీ కొత్త డిస్పెన్సరీలో కూడా ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa