టర్కీ వేదికగా అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాల అధికార మీడియాలు మంగళవారం మధ్యాహ్నం (అక్టోబరు 28న) ప్రకటించాయి. ఈ ప్రతిష్టంభనకు మీరంటే మీరే కారణమని ఇరు దేశాలూ ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. పాక్‌పై ఉగ్రదాడులకు తన భూభాగాన్ని ఉపయోగించబోమన్న హామీ ఇవ్వడం సహా 'తార్కిక, చట్టబద్ధమైన డిమాండ్లను' అఫ్గన్ అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని చర్చల ప్రత్యక్షంగా తెలిసిన ముగ్గురు పాకిస్థాన్ అధికారులు అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. అయితే, దీని గురించి ఇప్పటి వరకూ ఇరు దేశాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
కానీ, తాలిబన్ల అధికారిక మీడియా RTA ప్రకారం.. అఫ్గన్ బృందం నిర్మాణాత్మక చర్చలకు అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపింది. దీనిపై పాక్ స్పందిస్తూ అఫ్గన్లు ‘మొండివైఖరి, ఉదాసిత ధోరణి చూపారని ఆరోపించింది. తదుపరి చర్చలు అఫ్గన్ సానుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ నిజంగా ఈ చర్చలు విఫలమైతే భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు. ఎందుకంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, భారత్‌లో దాడులకు నిధులు సమకూర్చడం, శిక్షణ సహా ఇతర రకాలుగా పాకిస్థాన్ సైన్యం మద్దతు ఇస్తోందని న్యూఢిల్లీ నిరంతరం ఆరోపిస్తూ వస్తోంది.
చర్చలు విఫలమైతే యుద్ధమే!
శాంతి చర్చలు విఫలమైతే ప్రత్యక్ష సంఘర్షణ తప్పా మాకు మరే ఆప్షన్ లేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ సోమవారం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మరో యుద్ధాన్ని భరించలేని ప్రపంచానికి ఆందోళనకరంగా మారింది. పాక్, అఫ్గన్ ప్రతినిధులు ఇప్పటికీ టర్కీలోనే ఉన్నప్పటికీ, నాలుగో దఫా చర్చలపై ఎటువంటి సమాచారం లేదు.
దోహా, టర్కీ మధ్యవర్తిత్వంతో అక్టోబరు 18-19 తేదీల్లో దోహా వేదికగా అఫ్గన్, పాకిస్థాన్ మధ్య తొలిదశ చర్చలు జరిగాయి. తమ దేశంలో ఉగ్రదాడులకు అఫ్గన్ మద్దతిస్తోందని పాకిస్థాన్ ఆరోపణలతో కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన విస్తృత దౌత్య ప్రయత్నాల్లో ఈ చర్చలు ఒక భాగం. ముఖ్యంగా తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ద్వారా తమ దేశంలో ఉగ్రదాడులకు తాలిబన్లు సహకరిస్తున్నారనేది పాక్ ప్రధాన ఆరోపణ. అయితే, దీనిని అఫ్గన్ గట్టిగా ఖండించింది. ఈ క్రమంలో కాబూల్ సహా అఫ్గన్‌లోని పలు ప్రాంతాలపై పాక్ వైమానిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. తాలిబన్, పాక్ సైన్యాలు పరస్పర దాడులు దిగడంతో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్టోబరు 15న ఇరు దేశాల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా కొద్ది గంటల్లోనే దీనిని ఉల్లంఘించాయి. ఆదివారం జరిగిన దాడిలో ఐదుగురు పాక్ సైనికులు, 25 మంది తాలిబన్ సైనికులు చనిపోయినట్టు మాజీ సైనికాధికారులు తెలిపారు.
అక్టోబరు మొదటి వారంలో మొదటిసారి తాలిబన్ మంత్రి భారత్ పర్యటనకు విచ్చేశారు. దీంతో నాలుగేళ్ల తర్వాత అఫ్గన్, భారత్ మధ్య దౌత్య సంబంధాలు పునరుద్దరణకు మార్గం సుగమం అయ్యింది. అఫ్గన్ విదేశాంగ మంతి అమిర్ ఖాన్ ముత్తఖీ నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాలుగేళ్ల అనంతరం కాబూల్‌లోని టెక్నికల్ మిషన్‌ను పూర్తిస్థాయి ఎంబసీగా మార్చాలని నిర్ణయించారు. అలాగే, పహల్గామ్‌లో ఉగ్రదాడిని ముత్తఖీ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూభాగాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa