ఆపద్ధర్మ నాయకుడిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన నుంచి.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు దగ్గరవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని బంగ్లాదేశ్‌ను పావుగా వాడుతూ.. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది ఉగ్ర పాకిస్తాన్. తాజాగా ఇలాంటి మరో ఎత్తుగడ వేసింది. బంగ్లాదేశ్ గడ్డను కేంద్రంగా చేసుకుని భారత్‌పై గూఢచర్యానికి పాల్పడేందుకు సిద్ధమవుతోంది. బంగ్లా రాజధాని ఢాకాలోని తమ ఎంబసీలో.. పాక్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేందుకు ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ జనరల్ సాహిర్ షంషద్ మీర్జా నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం.. బంగ్లా జాతీయ భద్రతా నిఘా సంస్థ (ఎన్ఎస్ఐ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఢాకాలోని పాక్ దౌత్య కార్యాలయంలో.. నిఘా అధికారులను నియమించుకునేందుకు బంగ్లాదేశ్ అనుమతి ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. పాక్ హై కమిషన్‌లో ఏర్పాటు చేయబోయే ఐఎస్ఐ సెల్లో ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి, ఇద్దరు కల్నల్స్, నలుగురు మేజర్లు ఉంటారని తెలుస్తోంది. భారత్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పాక్ ఈ కుయుక్తులు పన్నుతున్ననట్లు నిపుణులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లోని భారత వ్యతిరేక శక్తులకు.. శిక్షణ ఇచ్చి మరీ ఇండియాపైకి ఎగదోసేందుకు దాయాది కుట్ర పన్నినట్లు పేర్కొంటున్నారు.
గత కొంతకాలంగా బంగ్లా, పాక్ మధ్య స్నేహం పెరుగుతోంది. ఇటీవల సాహిర్ షంషద్ మీర్జా.. బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో పరస్పరం సహాయం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా బంగ్లా భద్రతా దళాలకు పాక్ సైన్యం శిక్షణ ఇచ్చే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. బంగ్లా సైన్యానికి సాంకేతిక సహకారం, శిక్షణ కార్యక్రమాలు, ఆయుధ వ్యవస్థల సరఫరా, సంయుక్త నౌకా, వాయుసేన విన్యాసాలు చేపట్టనున్నట్లు సదరు వార్తల సారాంశం. అంతేకాకుండా పాక్ వద్ద ఉన్న జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్ల పైనా కూడా.. ఢాకా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బంగ్లాదేశ్ అత్యున్నత స్థాయి మిలిటరీ బృందం పాక్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత్‌కు డేంజర్ ఇదే..
బంగ్లాదేశ్‌కు సాయం అందిస్తూ.. పావులా వాడుతూ భారత్‌కు పక్కలో బళ్లెంలా తయారు చేస్తోంది పాకిస్తాన్. పూర్తి స్థాయిలో బంగ్లా కూడా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. ఢిల్లీకి సవాళ్లు తప్పవు. ఇప్పటివరకు జమ్ముకశ్మీర్‌లో ఉన్న పరిస్థితి, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నెలకొంటుంది. బంగ్లాదేశ్ గడ్డపై నుంచి సీమాంతర ఉగ్రవాదం కోరలు చాచే అవకాశం ఉంది. చొరబాట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa