ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్పొరేట్ ఆఫర్ వదిలేసి.. ఏడాదికి రూ.కోటి టర్నోవర్‌

national |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:27 PM

చిన్నప్పటి నుంచే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజినీర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావాలంటూ.. చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఇక వాళ్ల తల్లిదండ్రులు కూడా.. పిల్లలను అటు వైపే ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇతర రంగాలు గానీ.. ఇతర కోర్సులు కానీ చేయడానికి పిల్లలు ఆసక్తి చూపరు.. అందుకు తల్లిదండ్రులు కూడా సిద్ధంగా ఉండరు. ఇక డిగ్రీలు, బీటెక్‌లు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల వైపే వెళ్తూ ఉంటారు. మంచి మంచి కంపెనీల్లో భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించి.. విదేశాలకు వెళ్లి స్థిరపడుతూ ఉంటారు. కానీ ఒక యువతి మాత్రం చదువు పూర్తి చేసి.. మంచి ఉద్యోగం వచ్చే దశలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగం వద్దని.. వ్యవసాయం చేస్తానంటూ రంగంలోకి దిగింది. మొదట అంతా ఆమె చేసిన పనికి నోరెళ్లబెట్టినా.. ఆ తర్వాత మాత్రం ఆమె సక్సెస్ కావడంతో చప్పట్లు కొడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల అనుష్క జైస్వాల్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.


ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన 28 ఏళ్ల అనుష్క జైస్వాల్.. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఫ్రెంచ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత హిందూ కాలేజీలో ప్లేస్‌మెంట్ సెల్ అధ్యక్షురాలిగా ఉన్నారు. డెస్క్ జాబ్ పట్ల ఆసక్తి చూపని అనుష్క జైస్వాల్.. 2017లో తనకు రావాల్సిన కార్పొరేట్ ఉద్యోగాన్ని తిరస్కరించారు. 2018-19లో తన ఇంటి డాబాపై టమోటాలు పెంచే చిన్న ప్రయత్నం చేశారు. అదే అప్పుడు ఆమెలో వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచింది. సంప్రదాయ వ్యవసాయంలోని సవాళ్లను నివారించేందుకు.. ఆమె సంరక్షిత సాగు వైపు అడుగులు వేశారు.


ఈ క్రమంలోనే నోయిడాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ టెక్నాలజీలో హార్టికల్చర్ ట్రైనింగ్‌తోపాటు.. సోలన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్‌లో మష్రూమ్ సాగు శిక్షణను నేర్చుకున్నారు. ఈ తర్వాత 2020లో లక్నో శివార్లలోని మోహన్‌లాల్‌గంజ్‌లో కేవలం ఒక ఎకరం భూమిలో తన పాలీహౌస్ ఫామ్‌ను అనుష్క జైస్వాల్ ఏర్పాటు చేశారు. ఆ ఫామ్‌లో ఆమె పాలీషీట్‌లు, ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, ఫ్యాన్, ప్యాడ్ వ్యవస్థను ఉపయోగించి పంటలకు అవసరమైన మైక్రోక్లైమేట్‌(నియంత్రిత ఉష్ణోగ్రత, తేమ)ను అందించారు. ఇది పంటలను తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి రక్షిస్తుంది.


24 ఏళ్ల వయస్సులో ఇంగ్లీష్ దోసకాయలను పండించడం ప్రారంభించిన అనుష్క జైస్వాల్.. మొదటి పంటలోనే 51 టన్నుల దిగుబడిని సాధించారు. అయితే ఇది సంప్రదాయ రైతులు పండించే పంట కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రధానంగా వివిధ రకాల బెల్ పెప్పర్ల సాగులో గుర్తింపు తెచ్చుకున్నారు. వీటిని లక్నో ప్రాంతంలో మేడమ్ కే ఖేత్ కే శిమ్లా మిర్చ్ అని పిలుస్తారు.


మొదట ఎకరం విస్తీర్ణంలో పంటను విజయవంతంగా తర్వాత.. ఆమె అదనంగా 5 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం మొత్తం 6 ఎకరాల్లో లెట్యూస్, బోక్ చోయ్, జుకినీ, కాలే, పార్స్లీ, రెడ్ క్యాబేజీ వంటి అరుదైన రకమైన కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరంలో రూ. 1 కోటికి పైగా టర్నోవర్‌ను అనుష్క జైస్వాల్ సాధించారు. ఆమె ఉత్పత్తులు బ్లింకిట్, బిగ్‌ బాస్కెట్ వంటి ఆన్‌లైన్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు, లూలూ హైపర్‌మార్కెట్‌ వంటి పెద్ద పెద్ద స్టోర్‌లకు కూడా సరఫరా అవుతున్నాయి. ఢిల్లీ, వారణాసి హోల్‌సేల్ మార్కెట్లలోనూ అనుష్క జైస్వాల్ ఉత్పత్తులు డెలివరీ అవుతున్నాయి.


వ్యవసాయం అంటేనే పురుషులు పనిచేసే రంగం కావడంతో.. 24 ఏళ్ల వయసులో కొత్త రకం సాగును ప్రారంభించినప్పుడు ఆమె విజయం సాధించదని.. ఎక్కువ రోజులు నిలబడలేదని సూటిపోటి మాటలతో విసగించారు. అయినప్పటికీ.. ఆమె వెనక్కి తగ్గకుండా నాణ్యమైన ఉత్పత్తులను పండించి విమర్శకుల నోళ్లను మూయించింది. ఇక తన పొలంలో 25-30 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. వారిలో అధిక శాతం మహిళలే కావడం గమనార్హం.


ఇక భూమి ఉత్పాదకతను పెంచడానికి ప్రతీ సంవత్సరం మే, జూన్ నెలల్లో రెండు నెలల పాటు భూమికి విశ్రాంతి ఇస్తామని.. రసాయనాలు ఉపయోగించకుండా ఎరువులను మాత్రమే వాడతామని ఆమె తెలిపారు. వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఇతరులకు సహాయం చేయడం, ముఖ్యంగా డాబాపై తోటలు ఏర్పాటు చేస్తున్న మహిళలు తమ ప్రయత్నాలను పెద్ద ఎత్తున విస్తరించాలని అనుష్క జైస్వాల్ ప్రోత్సహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa