బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన ప్రవాసంపై తొలిసారిగా మౌనం వీడారు. తన ప్రాణాలను, తన చుట్టూ ఉన్నవారి భద్రతను కాపాడేందుకే దేశం విడిచి పెట్టాల్సి వచ్చిందని, అదొక ‘తప్పనిసరి అవసరం’గా మారిందని ఆమె స్పష్టం చేశారు. తన పాలనను కూల్చివేసిన విద్యార్థుల నిరసనలను ‘హింసాత్మక తిరుగుబాటు’గా అభివర్ణించిన ఆమె, భద్రతా బలగాలు కాల్పులు జరపాలని తాను ఆదేశించానన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.బ్రిటిష్ మీడియా సంస్థ ‘ది ఇండిపెండెంట్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా పలు కీలక విషయాలు వెల్లడించారు. "నేను అక్కడ ఉండి ఉంటే నా ప్రాణాలకే కాదు, నా చుట్టూ ఉన్నవారికి కూడా ప్రమాదం వాటిల్లేది" అని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు 5న ఆమె దేశం విడిచి భారత్ కు వచ్చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో తన అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఉన్నప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఉద్యోగాల్లో కోటాను రద్దు చేయాలనే డిమాండ్‌తో మొదలైన విద్యార్థుల నిరసనలు, చివరికి తన ప్రభుత్వాన్ని కూల్చివేసే స్థాయికి చేరాయని హసీనా అన్నారు. ఈ నిరసనలను ‘హింసాత్మక తిరుగుబాటు’గా పేర్కొన్న ఆమె, "నాయకురాలిగా నేను బాధ్యత తీసుకుంటాను. కానీ, భద్రతా బలగాలను కాల్పులు జరపమని ఆదేశించాననడం పూర్తిగా అబద్ధం" అని తేల్చిచెప్పారు. ఘర్షణల్లో మరణాలు సంభవించడానికి క్షేత్రస్థాయిలో భద్రతా దళాల్లో క్రమశిక్షణ లోపించడమే కారణమని ఆరోపించారు. మృతుల సంఖ్యను 1,400గా ప్రచారం చేయడాన్ని ఆమె తోసిపుచ్చారు. అది కేవలం తనపై జరుగుతున్న ప్రచారంలో భాగమేనని, ఆ సంఖ్యను భారీగా పెంచి చెబుతున్నారని అన్నారు.ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తనపై జరుపుతున్న విచారణను హసీనా ‘బూటకపు విచారణ’గా కొట్టిపారేశారు. "నన్ను రాజకీయంగా అంతం చేయడానికే, ఎన్నిక కాని ప్రభుత్వం నా రాజకీయ ప్రత్యర్థులతో ఈ బూటకపు కోర్టును నడుపుతోంది" అని ఆమె ఆరోపించారు. ఈ విచారణలో తనకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోనని, భయపడబోనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం మాత్రం విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన హింసకు, మానవ హక్కుల ఉల్లంఘనకు షేక్ హసీనానే ‘ప్రధాన సూత్రధారి’ అని ఆరోపిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో హసీనా తన రాజకీయ పునరాగమనంపై గానీ, బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే ప్రణాళికలపై గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa