గత కొన్ని రోజులుగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. సరిహద్దుల్లో నిత్యం కాల్పులు, దాడులు జరుగుతుండగా.. తాజాగా జరిగిన దౌత్య చర్చల ద్వారా ఈ గొడవలు కాస్తా ఉపశమనం పొందాయి. టర్కీ, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇస్తాంబుల్‌లో అక్టోబర్ 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఫలించాయి. రెండు దేశాల మధ్య ఈ నెల ప్రారంభంలో దోహాలో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందాన్ని పొడిగించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి..
గురువారం రోజు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటన ప్రకారం.. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, టర్కీ, ఖతార్ ప్రతినిధులు "యుద్ధ విరమణ కొనసాగింపునకు" అంగీకరించారు. తదుపరి అమలు వివరాలను ఖరారు చేయడానికి నవంబర్ 6న ఇస్తాంబుల్‌లో సీనియర్ అధికారులు తిరిగి సమావేశం అవుతారు. ముఖ్యంగా కొత్త ఘర్షణలను నివారించడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన డిమాండ్‌ను ఇరు పక్షాలు ఆమోదించాయి. కాల్పుల విరమణను సమర్థవంతంగా అమలు చేయడానికి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి పర్యవేక్షణ, ధృవీకరణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి.
అఫ్గానిస్థాన్‌లోని ఇస్లామిక్ ఎమిరేట్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విడుదల చేసిన ప్రకటనలో.. వివాదాలను దౌత్యం, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని నొక్కి చెప్పారు. కాబూల్ సమగ్రమైన, వృత్తిపరమైన బృందాన్ని నియమించిందని.. చర్చలు నిజాయితీగా జరిగాయని ముజాహిద్ పేర్కొన్నారు. పరస్పర గౌరవం, జోక్యం చేసుకోకపోవడం, దాడి చేయకపోవడం ఆధారంగా పాకిస్థాన్‌తో సానుకూల సంబంధాల పట్ల అఫ్గానిస్థాన్ ఆసక్తిని ఆయన పునరుద్ఘాటించారు.
అంతకుముందు అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ.. పాకిస్థాన్‌ను హెచ్చరించారు. అఫ్గానిస్థాన్‌పై ఎటువంటి దురాక్రమణ చర్య అయినా పెద్ద తప్పు అవుతుందన్నారు. అలాగే పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందఅని పేర్కొన్నారు. అయితే చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా వచ్చే వారం ఇస్తాంబుల్‌లో జరగబోయే చర్చలు ఈ శాంతి ఎంత కాలం నిలుస్తుందో నిర్ణయిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa