పోలవరం ప్రాజెక్ట్‌ను విధ్వంసం చేసింది వైసీపీ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. శనివారం వేలేరుపాడులో పోలవరం నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ... పోలవరం నిర్వాసితుల ద్రోహి జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు లక్షా 99 వేల ఎకరాలు అవసరం ఉందని.. ఇప్పటి వరకు 86, 900 ఎకరాలు సేకరించామని తెలిపారు. ప్రాజెక్టు రెండో దశకు 67,600 ఎకరాలు అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 29,700 ఎకరాలు సేకరించినట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబుగా ఉండగా మూడుసార్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందజేసినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ప్యాకేజ్ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా మానవత్వం లేని వ్యక్తి జగన్’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితుల కోసం కాలనీలు నిర్మించడానికి ఒక్క ఇటుక కూడా ఇవ్వలేదన్నారు. 739 కోట్ల రూపాయలతో 49 కొత్త కాలనీల నిర్మాణానికి టెండర్లు పిలిచామని గుర్తుచేశారు. అయితే కాలనీలు నిర్మించకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ మొద్దు నిద్రపోయారని ఎద్దేవా చేశారు. 17,200 కుటుంబాలకు కొత్తగా జనవరి నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేయబోతున్నామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa