ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్‌లో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం చాలా సవాల్‌తో కూడుకుంది. పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, డయాబెటిస్, హై బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
అయితే, ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఫిట్‌గా ఉండటం ఎంతో ముఖ్యం. ఫిట్‌గా ఉండటం కోసం చాలా మంది జిమ్‌లు చుట్టూ తిరుగుతుంటారు. అయితే, వాకింగ్ అన్నిటికన్నా చాలా ఉత్తమమైన బెస్ట్ ఆప్షన్. ఇక, ఈ రోజుల్లో వివిధ వాకింగ్ రూల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. జపనీస్ వాకింగ్, నార్డిక్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ ఇలా వివిధ ఫిట్‌నెస్ వాకింగ్ రూల్స్ ఉన్నాయి.
ఇక, లేటెస్ట్‌గా 6-6-6 వాకింగ్ రూల్ అనే కొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో, ఫిట్‌నెస్ బ్లాగుల్లో వేగంగా ప్రజాదరణ పొందుతోంది. 6-6-6 నడక నియమం అంటే ఏంటి, దాని ఆరోగ్య ప్రయోజనాలేంటో ప్రముఖ ట్రైనర్ సారా క్యాంపస్ చెప్పారు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
6-6-6 నడక అంటే ఏంటి?
ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం, 6-6-6 నడక నియమం ఒక సరళమైన పరిష్కారం. ఇది ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సులభమైన మార్గాలలో ఒకటి. ఈ ఫిట్‌నెస్ దినచర్య ప్రకారం, ఒక వ్యక్తి వారానికి ఆరు రోజులు ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు 60 నిమిషాలు వేగంగా నడవాలి.
నడకకు ముందు 6 నిమిషాల వార్మప్, తర్వాత 6 నిమిషాల కూల్-డౌన్ చేయాలి. ఈ దినచర్య శరీరాన్ని నడకకు సిద్ధం చేయడమే కాకుండా వ్యాయామం తర్వాత సురక్షితమైన కోలుకునేలా చేస్తుంది.
6-6-6 వాకింగ్ ఎలా చేయాలి?
* ఉదయం 6 గంటలకు నడకతో ప్రారంభించండి: ఉదయం 6 గంటలకు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పరిశోధన ప్రకారం, రోజూ 30 నిమిషాలు నడవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 35% తగ్గుతుంది. ఉదయపు తాజా గాలి వల్ల రోజంతా ఉత్సాహంగా, ఏకాగ్రతతో గడపవచ్చు.
* సాయంత్రం 6 గంటలకు నడక: బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది రోజంతా ఒత్తిడి అనుభవిస్తున్నారు. ఇలాంటి వారికి సాయంత్రం నడక మంచి ఆప్షన్. ఇది మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా మీ శరీరాన్ని మంచి రాత్రి నిద్రకు సిద్ధం చేస్తుంది.
* 60 నిమిషాల నడక: రోజూ 60 నిమిషాల వాకింగ్ శరీరాన్ని కొవ్వును కరిగించే రీతిలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం, ఊపిరితిత్తుల పనితీరు, ఓర్పును మెరుగుపరుస్తుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం, వారానికి 30-60 నిమిషాల కండరాలను బలోపేతం చేసే కార్యకలాపాలు అన్ని వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు. ఈ గంట శారీరకంగానే కాకుండా మానసిక సమతుల్యతను కూడా అందిస్తుంది.
6 నిమిషాల వార్మప్, కూల్‌డౌన్
* 6 నిమిషాల వార్మప్: నడకకు ముందు 6 నిమిషాల వార్మప్ శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, రక్త ప్రవాహాన్ని పెంచడానికి సాయపడుతుంది. అంతేకాకుండా కండరాల వశ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, వార్మప్ చేయడం వల్ల క్రీడా గాయాల ప్రమాదం తగ్గుతుంది. కండరాల శక్తి పెరుగుతుంది.
* 6 నిమిషాల కూల్‌డౌన్ : నడకకు ముందు శరీరాన్ని సిద్ధం చేసుకోవడం ఎంత ముఖ్యమో, చురుకైన నడక తర్వాత చల్లబరచడం కూడా అంతే ముఖ్యం. చల్లబరచడం వల్ల హృదయ స్పందన రేటు సాధారణంగా ఉంటుంది. కండరాల దృఢత్వం తగ్గుతుంది. ఇది మీ ఫ్లెక్సిబులిటీని పెంచుతుంది.
6-6-6 వాకింగ్‌తో మేలు
ఈ ఒక గంట నడక రోజుకు సుమారు 6,000 నుంచి 7,000 అడుగులు అందిస్తుంది. లాన్సెట్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ 7,000 అడుగులు నడవడం మెదడు శక్తిని పెంచడానికి, అనేక తీవ్రమైన వ్యాధులను నివారించడానికి సరిపోతుందని భావిస్తారు.
ప్రయోజనాలు
* ఉదయం నడక శరీర జీవక్రియను సమతుల్యం చేస్తుంది. అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు. సాయంత్రం నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* 60 నిమిషాల రోజువారీ నడక గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాలు, కీళ్లను సరళంగా ఉంచుతుంది.
* క్రమం తప్పకుండా 6-6-6 వాకింగ్ చేయడం వల్ల జీవక్రియ సక్రియం అవుతుంది. బరువు నిర్వహణకు సాయపడుతుంది. అంతేకాకుండా ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa