పరిశుభ్రమైన వీధులు, మర్యాదపూర్వకమైన ప్రజలు, ఎక్కడ చూసినా ప్రశాంతమైన వాతావరణం.. జపాన్ అంటే మనందరి మదిలో మెదిలే ఆలోచనలు ఇవే. అందుకే అనేక మంది జపాన్‌లో స్థిరపడాలని కలలు కంటుంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు, జపాన్ మిగతా ప్రపంచంతో పోలిస్తే ఎందుకు అంత ప్రత్యేకమైనదో వివరిస్తున్నాయి. 'జపాన్‌లో నివసించడానికి మూడు కారణాలు' అంటూ వైరల్ అవుతున్న ఆ ప్రత్యేక విషయాలు నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఫైనాన్స్ నేర్పే పిల్లల బ్యాంకులు
జపాన్‌లో ఒక వింత, వినూత్నమైన సంస్కృతి ఉంది. అక్కడ పిల్లల కోసమే ప్రత్యేకంగా బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఇవి సాధారణ బ్యాంకుల మాదిరిగానే పనిచేసినా.. లోపలికి వెళ్లడానికి వాళ్ల తల్లిదండ్రులకు కూడా అనుమతి ఉండదు. ఈ చిల్డ్రన్స్ బ్యాంకుల్లోకి ఆ చిన్నారి ఖాతాదారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
చిన్న వయసు నుంచే పిల్లలకు డబ్బు మీద బాధ్యత నేర్పించడానికి.. ఫైనాన్స్ ఎలా నిర్వహించాలో తెలియజేయడానికి ఈ విధానాన్ని పెట్టారు. ఇక ఈ బ్యాంకుల్లో పిల్లలే వాళ్ల సొంత ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దానిపైన వడ్డీ కూడా సంపాదిస్తారు. ఇది వారిలో పొదుపు అలవాటును.. ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుందని అక్కడి వారు చెబుతున్నారు.
దొంగతనం భయమే లేదు
జపాన్ అత్యంత సురక్షితమైన దేశంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ భద్రత అనేది కేవలం నియమం కాదు.. అది ప్రజల జీవనశైలిలో ఒక భాగం. ఆ దేశం ఎంత సురక్షితమంటే.. మన దేశంలో ఊహించడానికి కూడా భయపడే విధంగా.. అక్కడ చిన్న పిల్లలు సైతం పెద్దల పర్యవేక్షణ లేకుండా ఒంటరిగా స్కూల్‌కి వెళ్తారు. జపాన్‌లో దొంగతనం అనేది దాదాపు ఉండదు. ఫోన్, పర్సు, బ్యాగ్‌ను బహిరంగ ప్రదేశంలో వదిలేసి.. ఒక గంట తర్వాత తిరిగి వచ్చినా అవి అక్కడే సురక్షితంగా ఉంటాయని చెబుతారు. ఇక ఏదైనా సమయంలో ఏ వస్తువైనా పోగొట్టుకుంటే.. వాటిని వెతకడానికి ప్రత్యేకంగా లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోర్లను ఏర్పాటు చేస్తారు. దొంగతనం గురించిన టెన్షన్ లేని లైఫ్ అంటే జపాన్‌లోనే సాధ్యమని చెబుతారు.
మూడో కారణం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. జపాన్‌లోని నారా అనే ప్రాంతంలో అడవి జంతువులు కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తాయట. అక్కడ జింకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఈ జింకలు పర్యాటకులు లేదా స్థానికుల దగ్గరికి వచ్చి.. ఏదైనా అడగడానికి ముందుగా తమ తలలు కిందకు వంచి నమస్కారం చేస్తాయట. ఇది యాదృచ్ఛిక చర్య కాదని.. ఆ ప్రాంతంలోని స్థానికులు వాటికి ఈ మర్యాద నేర్పించారని తెలుస్తోంది. అదే ఇప్పుడు ఆ ప్రాంతం సాంస్కృతిక సంప్రదాయంగా మారిపోయింది.
నారా ప్రాంతంలో ఈ జింకలను పవిత్రంగా భావించి రక్షిస్తారు. ఈ మర్యాద తెలిసిన జింకలను చూడటానికే ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి రావడం విశేషం. ఇలాంటి విచిత్రమైన, వినూత్నమైన ఆచారాలు, జీవన ప్రమాణాలు ఉన్నాయి కాబట్టే.. జపాన్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక దేశంగా, అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa