ధన దాహం, కమీషన్లకు కక్కుర్తిపడి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని స్వామివారి నైవేద్యంలో ఉపయోగించి మహా పాపానికి ఒడిగట్టారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్తీ నెయ్యి కుంభకోణంపై కీలక వివరాలను వెల్లడించారు.వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన జగన్ కుటుంబ సభ్యులు శ్రీవారి సొమ్మును దోచుకోవడమే కాకుండా, ప్రసాదాన్ని కల్తీ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని పట్టాభి విమర్శించారు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణ (క్రైమ్.నెం 470/2024) కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. ఈ కేసులో ఏ-16గా ఉన్న సుగంధ ఆయిల్ అండ్ కెమికల్స్ సంస్థ యజమాని అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయని తెలిపారు.భోలే బాబా డెయిరీ సంస్థకు అజయ్ కుమార్ అత్యంత సన్నిహితుడు. 2022-24 మధ్య కాలంలో ఈ సుగంధ కెమికల్స్ సంస్థ భోలే బాబా డెయిరీకి రూ.8 కోట్లకు పైగా విలువైన ప్రమాదకర రసాయనాలను సరఫరా చేసింది. ఆ రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసి, టీటీడీకి 68.17 లక్షల కిలోలు సరఫరా చేశారు. తద్వారా ఏకంగా రూ.251 కోట్లు దోచుకున్నారు అని పట్టాభి వివరించారు. హార్ష్ ఫ్రెష్ ఫుడ్స్, హార్ష్ డెయిరీ పేర్లతో, పామాయిల్‌తో తప్పుడు బిల్లులు సృష్టించి మోనోగ్లిసరైడ్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్‌ల వంటి రసాయనాలతో నెయ్యి తయారు చేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టి, తాము పారదర్శకంగా ఉన్నామని సిగ్గులేకుండా ఎలా చెప్పుకుంటున్నారు అని ఆయన నిలదీశారు.ఈ కుంభకోణంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్రపై పట్టాభి తీవ్ర ఆరోపణలు చేశారు. "2022లో వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడే నెయ్యిలో పామాయిల్ కలిసిందని నివేదికలు వచ్చాయి. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ ఏడాది మే నెలలో భోలే బాబా డెయిరీ యజమాని హైదరాబాద్‌లో సుబ్బారెడ్డిని కలిసింది వాస్తవం కాదా చిన్న అప్పన్నను అడ్డం పెట్టుకుని రాయబేరాలు జరిపింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి కమీషన్లు ముట్టడం వల్లే కల్తీ నెయ్యి అని తెలిసినా కాంట్రాక్టులు కొనసాగించారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో సుబ్బారెడ్డి పాత్ర లేకపోతే, సిట్ అధికారులు బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లారు అని పట్టాభి ప్రశ్నించారు.ఎన్నికలకు ముందు టెండర్ల ప్రక్రియలోనూ భారీగా అక్రమాలు జరిగాయని పట్టాభి ఆరోపించారు. "భోలే బాబా డెయిరీ డైరెక్టర్లుగా ఉన్న విపిన్ జైన్, పొమిల్ జైన్‌లే ‘ఏఆర్ డెయిరీ’ పేరుతో మరో సంస్థను నడుపుతున్నారు. , 2024 మార్చి 12న టెండర్లు పిలిచి, మే 8న ఏఆర్ డెయిరీకి అనుగుణంగా నిబంధనలు మార్చారు. మే 15న కేవలం రూ.319కే 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా ఆర్డర్‌ను కట్టబెట్టారు. ఒక్క లీటరు కూడా కొనుగోలు చేయకుండానే ప్రమాదకర రసాయనాలతో చేసిన నెయ్యికి టెండర్ ఖరారు చేసింది వైసీపీ పెద్దలే" అని దుయ్యబట్టారు.కల్తీ నెయ్యిని తయారు చేసింది భోలే బాబా డైరెక్టర్లు అయితే, ఈ వ్యవహారం మొత్తం తెలిసి కూడా కమీషన్ల కోసం తెర వెనుక నడిపించింది వైసీపీ పెద్దలేనని ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని పట్టాభి పిలుపునిచ్చారు. ఈ కల్తీ వార్త తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తీవ్రంగా బాధపడ్డారని, వారి మనోభావాలను దెబ్బతీసిన ఈ మహా పాపాన్ని ఎవరూ క్షమించరని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa