పశ్చిమ్ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బన్‌గావ్‌లో నిర్వహించిన ఈ ర్యాలీలో కేంద్ర ఎన్నికల కమిషన్ , బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయంగా బీజేపీ తనతో పోరాడలేదని, తనను ఓడించడం వారికి అసాధ్యమని బెంగాల్ సీఎం స్పష్టం చేశారు. అంతేకాదు, బెంగాల్‌లో తనకు సవాల్ విసరాలని చూస్తే.. దేశం మొత్తం బీజేపీ పునాదులను కదిలిస్తానని దీదీ హెచ్చరించారు. రాజ్యాంగబద్దమైన ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్‌గా మారిందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
బిహార్‌లో ఎస్‌ఐఆర్ వల్లే ఫలితాలు ఆలా వచ్చాయని, అక్కడ బీజేపీ గేమ్‌ను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. అంతేకాక, ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మహిళలకు రూ.10,000 ఇవ్వడంపై కూడా దీదీ ప్రస్తావించారు. ‘‘నేను ముందుగానే చెప్పేస్తున్నా… గుజరాత్‌లో (ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం) బీజేపీ ఓడిపోబోతోంది.. బెంగాల్‌లో గెలవడానికి వారు గుజరాత్‌ను కోల్పోవాల్సి వస్తుంది’’ అని దీదీ జోస్యం చెప్పారు. 1990 నుంచి గుజరాత్‌లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. 2022 ఎన్నికల్లో ఆ పార్టీ 156 స్థానాల్లో విజయం సాధించి, చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
ఒకవేళ అక్రమ బంగ్లాదేశీయులను తొలగించడమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లక్ష్యమైతే.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ఎందుకు నిర్వహిస్తున్నారని దీదీ నిలదీశారు. అంటే.. ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వ రాష్ట్రాల్లో చొరబాటుదారులు ఉన్నారనేది బీజేపీ అంగీకరిస్తోందా? అని ప్రశ్నించారు.
‘‘ఇంతకాలం సరిహద్దు జిల్లాల్లో అక్రమ వలసదారులు నిజంగానే ఉండి ఉంటే ఇంటర్నేషనల్ బోర్డర్‌ను కాపాడే బాధ్యత ఎవరిదని నేను అడగాలనుకుంటున్నాను? విమానాశ్రయాలు, కస్టమ్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి.. కానీ నేను ఇక్కడ ఉన్నంత వరకు వాళ్లు మిమ్మల్ని వెళ్లగొట్టడానికి నేను అనుమతించను’’ అని దీదీ ఉద్ఘాటించారు.
రాష్ట్రంలోని మతువా కమ్యూనిటీ మెజారిటీ ప్రాంతాల్లోని ఓటర్లు ‘పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)’ కింద తమను తాము విదేశీయులుగా ప్రకటించుకుంటే తక్షణమే ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లు తొలగిస్తారని బెంగాల్ సీఎం అన్నారు. ఎస్‌ఐఆర్ ముగిసి రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన తర్వాత.. ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికలకు ముందు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, రెండు, మూడేళ్లపాటు నిర్వహిస్తే తాము సహకరిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa