ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కాఫీ రైతుల పిల్లల కోసం ఉపకార వేతనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 07:45 PM

కాఫీ రైతులకు కాఫీ బోర్డు శుభవార్త వినిపించింది. కాఫీ రైతుల పిల్లల కోసం ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్స్) అందిస్తోంది. కాఫీ తోటల్లో పనిచేసే వారి పిల్లల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కాఫీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. పాడేరు మన్యంలోని కాఫీ రైతుల పిల్లలకు కాఫీ బోర్డు ఈ అవకాశం కల్పిస్తోంది. 2025- 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తున్నట్లు కాఫీ బోర్డు ఎస్ఎల్ఓ మంగళవారం వెల్లడించారు. కాఫీ రైతుల పిల్లల చదువులను దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం ఇలాగే ఉపకార వేతనాలు అందిస్తున్నామని వివరించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా స్కాలర్‌షిప్స్ అందిస్తున్నామన్న కాఫీ బోర్డు అధికారులు.. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 28 వరకూ సమయం ఉన్నట్లు వివరించారు. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని సూచించారు.


కాఫీ బోర్డు స్కాలర్‌షిప్స్.. ఎవరికి ఎంతంటే?


ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ - రూ. 5000


డిగ్రీ, బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, ఏఎన్ఎం - రూ. 7000


ఎమ్మెస్సీ, ఎంటెక్, పీజీ కోర్సులు, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు - రూ.20000 వరకూ


అర్హత వివరాలు..


మరోవైపు ఈ ఉపకార వేతనాల కోసం కాఫీ బోర్డు కొన్ని అర్హతలు నిర్దేశించింది. కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. కాఫీ రైతుల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం. ఆసక్తికలిగిన వారు నవంబర్ 28వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అరకులోయ, చింతపల్లి, మినుములూరు కాఫీ బోర్డు ఆఫీసులలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు పాడేరు మన్యం ప్రాంతానికి సంబంధించి ఏటా 10 వేల మంది కాఫీ రైతుల పిల్లలకు కాఫీ బోర్డు ఇలా ఉపకార వేతనాలు అందిస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ మూడున్నర వేల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


మరోవైపు పాడేరు మన్యం ప్రాంతం కాఫీ పంట సాగు చేయడానికి అనుకూల ప్రాంతం. దీంతో పాడేరు డివిజన్‌ పరిధిలో సుమారుగా 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ పంట సాగు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం 17000 మెట్రిక్ టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. అయితే సరైన ధర రాకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాఫీ కొనుగోలు ధరలు ఇటీవల పెంచారు. విశాఖలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవలే ఐటీడీఏ వెల్లడించింది. కాఫీ రకాన్ని అనుసరించి కిలోకు పది రూపాయల నుంచి 50 రూపాయల వరకూ పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa