ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలను కించపరిచేలా విమర్శలు చేయడం తగదన్న సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 08:03 PM

మహిళలను కించపరిచేలా, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సాగుతున్న ధోరణులకు అడ్డుకట్ట పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో హద్దులు లేకుండా కొందరు మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, ఈ దుష్ప్రచారాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నేటి ఆడపిల్లలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆడపిల్లల్లా ఏడవద్దు గాజులు తొడుక్కున్నావా' వంటి అవమానకరమైన మాటలను సమాజం నుంచి పూర్తిగా తొలగించాలని ఆయన హితవు పలికారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ పాఠశాల శాసనసభ'  కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం మొదటి నుంచి కట్టుబడి ఉందని గుర్తుచేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా సంఘాలను స్థాపించి మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశానని, విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి వారి ప్రగతికి తోడ్పడ్డానని వివరించారు.భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మన పౌరులకు అందించిన గొప్ప ఆయుధమని చంద్రబాబు కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే ఎన్నో అద్భుతాలు సాధ్యమయ్యాయన్నారు.ఒకప్పుడు ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి  ఈ దేశానికి ప్రధాని అయి దేశ దశ, దిశను మారుస్తున్నారంటే అది మన రాజ్యాంగం గొప్పతనమే. సాధారణ కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, భారతరత్నగా ఎదిగారు. గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి అయ్యారు. అలాగే, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానంటే అది కూడా రాజ్యాంగం ఇచ్చిన అవకాశమే అని ఆయన పేర్కొన్నారు.రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా ఇచ్చిందని, కొందరు హక్కుల కోసం పోరాడతారు కానీ బాధ్యతలను విస్మరిస్తారని అన్నారు. శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని, చట్టసభలకు వ్యక్తిగత కక్షల కోసం కాకుండా ప్రజాహితం కోసం రావాలని సూచించారు.మంచి, చెడులను విశ్లేషించుకునే శక్తి విద్యార్థులకు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. సంక్షోభాలను చూసి భయపడకుండా వాటిని అవకాశాలుగా మార్చుకున్నప్పుడే విజయం సాధ్యమవుతుందని అన్నారు. తాను చిన్నప్పుడు లాంతరు వెలుగులో చదువుకుని, 1999లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చానని, ఇప్పుడు సొంతంగా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి చేరుకున్నామని గుర్తుచేశారు. విద్యార్థుల్లో విలువలు పెంపొందించాలనే లక్ష్యంతోనే చాగంటి కోటేశ్వరరావు వంటి వారిని నియమించామని తెలిపారు.ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, త్వరలోనే అగ్రగామిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'వికసిత్ భారత్', 'స్వర్ణాంధ్ర' లక్ష్యాలను కలిసికట్టుగా సాధిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులతో కలిసి 'కాన్సిటిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa