పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్లు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆయన ముగ్గురు సోదరీమణులు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా నొరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్‌లు సోదరుడి కోసం జైలు వద్దకు వెళ్లగా.. తమపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల తమను, తమ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ మద్దతుదారులను పోలీసులు హింసించారని పేర్కొన్నారు.
గత మూడు వారాలకు పైగా తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించకపోవడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ తాము శాంతియుతంగా నిరసన తెలియజేసినట్లు వివరించారు. కానీ పంజాబ్ పోలీసులు మాత్రం తమపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆరోపించారు. ఈ ఘటనపై పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు రాసిన లేఖలో.. "ఈ హింస ఘోరమైనది, ప్రణాళికాబద్ధమైనది, ఎలాంటి ప్రేరణ లేకుండా పోలీసు సిబ్బందితో నిర్వహించబడింది" అని పేర్కొన్నారు. నిరసన తెలుపుతున్న సమయంలో రోడ్లను గానీ, ప్రజల కదలికలను గానీ తాము అడ్డుకోలేదని నొరీన్ నియాజీ తెలిపారు.
అలాగే "ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆ ప్రాంతంలోని వీధి దీపాలు అకస్మాత్తుగా ఆపేశారు. ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాన్ని చీకట్లోకి నెట్టారు. దాని తర్వాత పంజాబ్ పోలీసు సిబ్బంది ఘోరమైన, ప్రణాళికాబద్ధమైన దాడి చేశారు" అని నొరీన్ వివరించారు. 71 ఏళ్ల తనను జుట్టు పట్టుకుని.. బలంగా నేలపైకి తోసి, రోడ్డుపై లాక్కెళ్లారని, దీని ఫలితంగా తనకు గాయాలు అయ్యాయని నొరీన్ తీవ్రంగా ఆరోపించారు. జైలు బయట ఉన్న ఇతర మహిళలను కూడా చెంపదెబ్బలు కొట్టి, ఈడ్చి పారేశారని పేర్కొన్నారు.
మరోవైపు బహుళ కేసుల్లో దోషిగా తేలిన పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఉన్నారు. అయితే తాజాగా ఆయనకు నెల రోజులకు పైగా అప్రకటిత సమావేశ నిషేధం విధించారు. ఇది చాలదన్నట్లుగా ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై జైలు అధికారులు మాత్రం అస్సలే స్పందించడం లేదు. దీంతో పీటీఐ వర్గాలు సహా ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన్ను చూడాలని గొడవ చేస్తున్నారు.
ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది ఖాలీద్ యూసుఫ్ చౌదరి మాట్లాడుతూ.. పుస్తకాలు, ముఖ్యమైన వస్తువులు, న్యాయవాదులను కూడా కలవనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. అలాగే సోహైల్ అఫ్రిది కూడా ఇమ్రాన్‌ను కలిసేందుకు ఏడుసార్లు ప్రయత్నించినప్పటికీ.. జైలు అధికారులు నిరాకరించారని గుర్తు చేశారు. ఈ దాడికి పాల్పడిన పోలీసు సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖాన్ సోదరీమణులు ఐజీపీ పంజాబ్‌ను డిమాండ్ చేశారు. పీటీఐ పార్టీ కూడా ఈ "ఘోరమైన" పోలీసు దాడిపై నిష్పాక్షిక విచారణ జరపాలని పిలుపునిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa