ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోదరితో ఇమ్రాన్ ములాఖత్.. ఆర్మీ చీఫ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు

international |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 08:32 PM

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మృతిచెందినట్టు జరుగుతోన్న ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. ఆడియాలో జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖానుమ్ డిసెంబరు 2న మంగళవారం సాయంత్రం కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె.. తన సోదరుడు క్షేమంగానే ఉన్నారని స్పష్టం చేశారు.


 ‘‘అల్లాహ్ దయవల్ల అతను బాగానే ఉన్నాడు... కానీ మానసికంగా హింసించడంతో కోపంతో ఉన్నాడు. రోజంతా సెల్‌లో బంధించి. కొద్దిసేపు మాత్రమే బయటకు విడిచిపెడుతున్నారు.. ఎవరితోనూ మాట్లాడనీయం లేదు..’’ అని అన్నారు. అలాగే, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడని పేర్కొంది. మొత్తం సైన్యాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న అసిమ్.. , తనకు, ఇతర సైన్యాధిపతులకు, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి జీవితకాల ఇమ్యూనిటీ కల్పించేలా రాజ్యాంగాన్ని తిరిగి రాయించుకున్నాడని ఆమె చెప్పింది.


గత కొద్దివారాలుగా పాక్ మాజీ ప్రధానిని కలవడానికి కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి నిరాకరించడంతో ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. ఇమ్రాన్ మద్దతుదారులు ఇస్లామాబాద్, రావల్పిండిలో నిరసనలకు దిగారు. దీంతో ఆ రెండు నగరాల్లో పోలీసులు నిషేధాజ్ఞ‌లు విధించారు. అయినాసరే, ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. ఇస్లామాబాద్ హైకోర్టు బయట మంగళవారం ఉదయం నిరసనకు దిగారు.


ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత నెల చివరి నుంచి ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఆయన ముగ్గురు చెల్లెళ్లు నురీన్ నియాజి, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ కలవడానికి ప్రయత్నిస్తే తమపై దాడి జరిగిందని చేసిన ప్రకటనతో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఆయన ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ భయాలను మరింత కలవరానికి గురిచేశాయి. తమ తండ్రి పరిస్థితి గురించి జైలు అధికారులు ఏదో దాస్తున్నారని వారు ఆరోపించారు. వారానికి ఒకసారి భేటీకి కోర్టు అనుమతించినప్పటికీ ప్రత్యక్షంగా కలవడం లేదా ఎటువంటి కాంటాక్ట్ జరగలేదని ఆయన కుమారుల్లో ఒకరైన కాసిమ్ ఖాన్ రాయిటర్స్‌కు తెలిపారు. అలాగే, ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడికి కూడా జైలు అధికారులు అనుమతి నిరాకరించారని ఆయన కుటుంబం ఆరోపించింది.


చివరకు డిసెంబరు 2న ఆయనను సోదరి ఉజ్మా ఖానుమ్‌ కలిసి, క్షేమంగా ఉన్నారని చెప్పడంతో మద్దతుదారులు శాంతించారు. గత 25 రోజులుగా ఇమ్రాన్‌ను కుటుంబసభ్యులు లేదా పార్టీ నేతలు కలవడానికి అనుమతించలేదు. దీంతో ఆయన చనిపోయినట్టు వదంతులు వ్యాపించి, లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు.


ఈ ఆందోళనలకు తోడు పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) సెనెటర్ ఖుర్రం జీషాన్ వ్యాఖ్యలతో షెహబాజ్ షరీఫ్, ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. ‘ఇమ్రాన్ ఖాన్‌ను దేశం నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడానికి ప్రత్యేక నిర్బంధంలో ఉంచుతున్నారని జీషాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రజాదరణకు ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఆయన ఫోటోలు లేదా వీడియోలు విడుదల చేయడంలేదని విమర్శించారు. ఇక, అవిశ్వాసం ద్వారా పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉన్నారు. ఆయన మరణంపై తొలిసారిగా వదంతులు అఫ్గన్ సోషల్ మీడియాలో వచ్చాయి. అప్పటి నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa