ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీతో తనది సన్నిహిత వ్యక్తిగత సంబంధం అని వెల్లడి

international |  Suryaa Desk  | Published : Sat, Dec 06, 2025, 06:10 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన ఫలవంతంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగుపయనం అయ్యే ముందు, తాను బస చేసిన హోటల్‌లోని సిబ్బందితో ఆయన ఫోటో దిగి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. హోటల్ సిబ్బంది అభ్యర్థనను మన్నించి, వారితో కలిసి పుతిన్ గ్రూప్ ఫోటోకు నవ్వుతూ ఫోజులివ్వడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రష్యాకు చెందిన ఓ జర్నలిస్ట్ తన టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేయగా, దీనిపై రష్యా అధికారిక వార్తా సంస్థ 'టాస్' ఒక కథనాన్ని ప్రచురించింది. ఫోటో సెషన్ ముగిసిన తర్వాత సిబ్బంది కృతజ్ఞతలు తెలుపగా, పుతిన్ వారికి చిరునవ్వుతో వీడ్కోలు పలికారు. అనంతరం సిబ్బంది తాము దిగిన ఫోటోలను కెమెరాల్లో ఎంతో ఆసక్తిగా చూసుకున్నారు.పర్యటనలో భాగంగా పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. చర్చల అనంతరం పుతిన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో తనకు అత్యంత సన్నిహితమైన, వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని తెలిపారు."భారత ప్రతినిధులతో జరిపిన చర్చలు చాలా ఫలవంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. అంతకుముందు రోజు రాత్రి ప్రధాని మోదీ తన నివాసంలో ఇచ్చిన విందులో ఏకాంతంగా సమావేశమయ్యాం. ఆ ఆత్మీయతకు నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా చర్చలు భారత్-రష్యా మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించాయి" అని పుతిన్ వ్యాఖ్యానించారు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎస్ సీవో సదస్సులో కూడా మోదీతో సమావేశమయ్యామని, తాము తరచుగా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటామని పుతిన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని, కీలక ప్రాజెక్టుల పురోగతిని తాము నిరంతరం పర్యవేక్షిస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయాలు, భద్రత, వాణిజ్యం, ఆర్థిక, సాంస్కృతిక, మానవతా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రాధాన్యతలను నిర్దేశిస్తూ ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేసినట్లు తెలిపారు. వాణిజ్యం, వలసలు, సముద్రయాన సహకారం, ఆరోగ్యం, ఆహార భద్రత, ఎరువులు, మీడియా, విద్యారంగ సహకారంతో పాటు ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు పలు కీలక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలపై  ఇరు దేశాలు సంతకాలు చేశాయి. పర్యటన ముగింపు సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఇచ్చారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa