పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 58 లక్షలకు పైగా ఓట్లను ఎన్నికల సంఘం తొలగించడమే ఇందుకు ప్రధాన కారణం. శుక్రవారం నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓటర్ల వివరాలను ఈసీ విడుదల చేసింది.ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో 44,787 ఓట్లను జాబితా నుంచి తొలగించారు. అదే సమయంలో, ప్రతిపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గమైన నందిగ్రాంలో 10,599 ఓట్లను తొలగించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు పట్టున్న చౌరింగీలో అత్యధికంగా 74,553 ఓట్లు, కోల్‌కతా పోర్టులో 63,730 ఓట్లు తొలగించారు. జిల్లాల వారీగా చూస్తే, టీఎంసీకి కంచుకోటగా భావించే దక్షిణ 24 పరగణాల జిల్లాలో అత్యధికంగా 8,16,047 ఓట్లు గల్లంతయ్యాయి.మరణాలు, ఓటర్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, నకిలీ ఓట్లు ఉండటం వంటి కారణాలతో ఈ తొలగింపులు చేపట్టినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 16న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు, ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపింది.ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 8 రాష్ట్రాలకు ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఎనిమిది రాష్ట్రాలకు 'స్పెషల్ రోల్ అబ్జర్వర్స్ను నియమించినట్లు ప్రకటించింది. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తుది జాబితా ప్రచురించే వరకు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ, రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa