రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్ర యువతకు భవిష్యత్ సాంకేతికతలో నైపుణ్యాలు అందించేందుకు క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించేలా దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.మంగళవారం అమరావతి సచివాలయంలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి, ఐబీఎం ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో విద్యార్థులకు ఏఐపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రతిపాదనలను సీఎంకు వివరించారు. వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల పాటు నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు తమ యాక్షన్ ప్లాన్‌ను సమర్పించారు.ఈ ప్రతిపాదనలను సమీక్షించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి క్వాంటం టెక్నాలజీపై అవగాహన ఉండాలని స్పష్టం చేశారు.ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా 7, 8, 9 తరగతుల విద్యార్థులకు క్వాంటం టెక్నాలజీపై అవగాహన కల్పించాలి. ఇందుకోసం అవసరమైన కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి అని సూచించారు.ఈ లక్ష్య సాధన కోసం ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 2026 జనవరి నెలాఖరు నాటికి క్వాంటం టెక్నాలజీలో నైపుణ్యాలు అందించేలా పాఠ్యాంశాలను సిద్ధం చేయాలన్నారు. సుమారు 50 వేల మందికి పైగా టెక్ విద్యార్థులకు ఈ నూతన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నేషనల్ ప్రొగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్’ వేదికను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు.విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 2026 జనవరి నెలాఖరులో ‘స్టూడెంట్స్ పార్టనర్‌షిప్ సమ్మిట్’ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ సదస్సులో విద్యార్థులు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శించే అవకాశం కల్పించనున్నారు. ఇదే సమావేశంలో రాష్ట్రంలో ట్రూ 5జీ సేవల విస్తరణపై బీఎస్ఎన్ఎల్ అధికారులతో కూడా సీఎం సమీక్షించారు. ఈ భేటీలో విద్యాశాఖ ఉన్నతాధికారులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa