ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగవద్గీత మత గ్రంథం కాదు.. మద్రాస్ హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 24, 2025, 08:59 PM

భగవద్గీత , వేదాంతం, యోగాలను కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు ఆసక్తికరమైన వార్తలు చేసింది. భగవద్గీత, వేదాంతం, యోగా వంటి అంశాలను బోధించడం వల్ల ఒక సంస్థను.. మతపరమైన సంస్థగా ముద్ర వేయలేమని స్పష్టం చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) కింద ఒక ట్రస్ట్ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో.. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఈ కీలక తీర్పును వెలువరించారు. భగవద్గీత మతాలకు అతీతమైనదని.. భారతీయ సంస్కృతికి చిహ్నమని ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు పేర్కొంది.


కోయంబత్తూరుకు చెందిన అర్ష విద్యా పరంపర ట్రస్ట్.. వేదాంతం, సంస్కృతం, హఠయోగం వంటి అంశాలను బోధిస్తూ ప్రాచీన గ్రంథాల డిజిటలైజేషన్ పనులను నిర్వహిస్తోంది. ఈ ట్రస్ట్ విదేశీ నిధులను పొందేందుకు 2021లో ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును తిరస్కరిస్తూ.. ట్రస్ట్ కార్యకలాపాలు మతపరమైనవిగా కనిపిస్తున్నాయని.. ముందస్తు అనుమతి లేకుండా రూ. 9 లక్షల విదేశీ విరాళాలను పొందిందనే.. రెండు ప్రధాన కారణాలను చూపింది.


ఈ కేసును విచారించిన జస్టిస్ స్వామినాథన్.. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలను తప్పుపట్టింది. భగవద్గీత కేవలం ఒక మతానికి పరిమితమైనది కాదని.. అది ఒక మోరల్ సైన్స్ అని. భారతీయ నాగరికతలో ఒక భాగమని పేర్కొంది. అంతేకాకుండా యోగాను మతపరమైన కోణంలో చూడటం అమానుషమని వ్యాఖ్యానించింది. యోగా అనేది విశ్వవ్యాప్తమైనదని.. అలాగే వేదాంతం మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన తత్వశాస్త్రమని తెలిపింది.


ఎఫ్‌సీఆర్ఏ చట్టం ప్రకారం ఒక సంస్థ మతపరమైనదా కాదా అని నిర్ణయించేటప్పుడు అధికారుల వద్ద కచ్చితమైన ఆధారాలు ఉండాలని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. కేవలం అలా కనిపిస్తోంది అనే అనుమానంతో దరఖాస్తును తిరస్కరించడం సరికాదని పేర్కొంది. 2021లో చేసుకున్న దరఖాస్తుపై 2024 అక్టోబర్‌లో చర్యలు తీసుకోవడం భావ్యం కాదని.. త్వరితగతిన, పారదర్శకంగా వ్యవహరించడం సుపరిపాలనలో ప్రాథమిక సూత్రమని ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది.


కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. గతంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనకు (రూ. 9 లక్షల విరాళం) సంబంధించి ట్రస్ట్ ఇప్పటికే జరిమానా కట్టి రాజీ పడినందున.. దాన్ని మళ్లీ కారణంగా చూపలేమని హైకోర్టు పేర్కొంది. ఈ దరఖాస్తును మళ్లీ కొత్తగా పరిశీలించి.. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆధ్యాత్మికత, మతం ఒకటి కాదని.. భారతీయ మూలాలను మతపరమైన కోణంలో మాత్రమే చూడటం సరికాదని ఈ తీర్పు ద్వారా కోర్టు స్పష్టం చేసింది. ఇది సాంప్రదాయ విద్య, యోగాను ప్రచారం చేసే అనేక సంస్థలకు ఊరటనిచ్చే అంశం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa