వెనిజులాలో జరిగినట్టు మనదేశంలోనూ జరుగుతుందా? అన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు పేలుతున్నాయి. ఆయనపై బీజేపీ మద్దతుదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. వెనిజులాపై సైనిక చర్యకు దిగిన అమెరికా.. అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా తీసుకెళ్లింది. ‘వెనుజులాలో జరిగినట్టు భారతదేశంలో కూడా జరుగుతుందా? మిస్టర్ ట్రంప్ మన ప్రధానమంత్రిని కిడ్నాప్ చేస్తారా?’ అని పృథ్విరాజ్ చవాన్ ప్రశ్నించారు. ఇవి అసంబద్ధమైన వ్యాఖ్యలని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ స్పందిస్తూ.. కాంగ్రెస్ నేత దేశం మొత్తాన్ని అవమానిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన మాదిరిగానే పలువురు చవాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనను మూర్ఖుడని, అజ్ఞాని ఆరోపిస్తూ భారత్ వంటి అణ్వస్త్ర దేశం విషయంలో ఈ వ్యాఖ్యల హాస్యాస్పదమైనవి అని తూర్పారబడుతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన చవాన్.. భారత్‌పై అమెరికా విధించిన అధిక సుంకాల విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించిన విమర్శల దాడి పరంపరను కొనసాగించారు.
‘‘50 శాతం సుంకాలతో వాణిజ్యం అసాధ్యం.. ఇది వాస్తవానికి భారత్-అమెరికా వాణిజ్యాన్ని ముఖ్యంగా భారత్ ఎగుమతులను అడ్డుకోవడమే అవుతుంది.. ప్రత్యక్ష నిషేధం సాధ్యం కాదు కాబట్టి, వాణిజ్యాన్ని ఆపడానికి సుంకాలను ఒక సాధనంగా ఉపయోగించారు. దీని భారాన్ని భారత్ భరించాల్సి ఉంటుంది.. గతంలో మాదిరిగా అమెరికాకు ఎగుమతుల ద్వారా మన ప్రజలు ఇకపై లాభాలు పొందలేరు.. దీనికి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టిసారించాలి.. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి’’ అని చవాన్ అన్నారు. ఈ క్రమంలోనే వెనుజులా మాదిరిగానే భారత్ విషయంలో ట్రంప్ చేస్తే పరిస్థితి ఏంటి? అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
‘‘వెనుజులాలో ఏం జరిగిందో అది ఐక్యరాజ్యసమితి ఛార్టర్‌కు వ్యతిరేకం... ఎన్నికైన ఓ అధ్యక్షుడ్ని అపహరించారు.. ఇది చాలా తీవ్ర ఆందోళనకరం.. రేపొద్దున్న మరే దేశంలోనైనా ఇలా జరగొచ్చు.. అది మన ఇండియాలోనే కావచ్చు.. ట్రంప్ చర్యలపై మోదీ స్పందించాలి.. మౌనంగా ఎందుకు ఉన్నారు’’ అని చవాన్ అన్నారు.
భౌగోళిక రాజకీయాలు, భద్రతా అంశాలను నిశితంగా గమనించే మాజీ డీజీపీ.. ‘వెనుజులాలో మదురోకు ఏమి జరిగిందో అదే నరేంద్ర మోదీకి జరగాలి అని అనుకోవడం దేశం మొత్తానికి అవమానకరం.. మాట్లాడే ముందు కనీసం ఆలోచించండి పృథ్వీరాజ్ చవాన్ .. లేకపోతే ఇదే ఇప్పుడు కాంగ్రెస్ అసలు సిద్ధాంతమా? ఆ పార్టీ వైఖరి బయటపడిందా?’ అని వైద్ ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa