ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కో వానరానికి రూ.25 లక్షలు.. కోతులకు భలే డిమాండ్

international |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 11:04 PM

చైనాలో బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో.. ల్యాబ్‌లలో ప్రయోగాల కోసం ఉపయోగించే కోతుల కొరత ఏర్పడింది. దీంతో కోతుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక్కో కోతి ధర 1.5 లక్షల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త ఔషధాల క్లినికల్ ట్రయల్స్ విపరీతంగా పెరగడం, కోతుల పెంపకంలో నెలకొన్న జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల మందుల తయారీ ఖర్చు పెరుగుతోందని.. కొత్త ప్రయోగాలు చేయడానికి మరింత సమయం పడుతోందని పేర్కొంటున్నాయి.


అయితే గతేడాది ఒక్కో కోతి సగటు ధర సుమారు 1,03,000 యువాన్లు అంటే దాదాపు రూ.13 లక్షలు ఉండగా.. 2026 ప్రారంభం నాటికి రూ.25 లక్షల వరకు చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయికి చేరిన కోతుల ధరలు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరుకోవడం పరిశోధనా సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.


కోతుల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు


2024-25లో చైనీస్ బయోటెక్ కంపెనీలు అంతర్జాతీయ డ్రగ్ మేకర్లతో రికార్డు స్థాయిలో ఒప్పందాలు చేసుకున్నాయి. దీనివల్ల అనేక కొత్త మందుల క్లినికల్ ట్రయల్స్ చేపట్టాయి. క్లినికల్ ట్రయల్స్ మధ్య, చివరి దశలకు చేరుకోగా.. ఆ దశల్లో కోతులపై పరీక్షలు చేయడం తప్పనిసరి అయింది. కోతులను పెంచి.. ప్రయోగాలకు సిద్ధం చేయడానికి కనీసం 4 ఏళ్ల సమయం పడుతుంది. ఇటీవల బయోటెక్ కంపెనీల ఒప్పందాలు రికార్డు స్థాయికి చేరినప్పటికీ.. ఉత్పత్తిదారులు తాము పెంచే కోతుల సంఖ్యను మాత్రం పెంచలేదు. దీనివల్ల ప్రస్తుతం పెరిగిన డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక బాటిల్ నెక్ పరిస్థితి ఏర్పడింది.


పరిశోధనలపై ప్రభావం


కోతుల కొరత కారణంగా అనేక ఔషధ పరిశోధనలు ఆలస్యం అవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని ల్యాబ్‌లు ఖర్చు తగ్గించుకోవడానికి ఒకసారి వాడిన కోతులను.. వాష్ అవుట్ పీరియడ్ తర్వాత మళ్లీ ఉపయోగిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రయోగాల వల్ల వచ్చే ఫలితాలు కొత్త కోతులపై చేసే ప్రయోగాల అంత కచ్చితంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు.


బ్రీడింగ్ సెంటర్లలో పెంచే కోతులే ఎందుకు?


మన దగ్గర ఏ ఊరికి వెళ్లినా కోతుల గుంపులు గుంపులుగా ఉంటాయి. మరి చైనాలో కోతుల కొరత ఏంటనే డౌట్ వచ్చిందా? కుదిరితే మన దగ్గర్నుంచి కోతులను ఎక్స్‌పోర్ట్ చేస్తే ఎలా ఉంటుందనే కన్నింగ్ బిజినెస్ ఐడియా కూడా వచ్చిందా? అయితే చట్టాలు దానికి ఒప్పుకోవు. చైనాలో కోతుల కొరతకు కారణం.. వైద్య పరిశోధన కోసం వాడే కోతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రీడింగ్ కేంద్రాల్లో పెంచుతారు. అడవుల్లో తిరిగే కోతులను పట్టుకొని వాటిపై ప్రయోగాలు చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ఎందుకంటే.. అడవుల్లో తిరిగే కోతులు రకరకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీని వల్ల క్లినికల్ ట్రయల్స్ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ల్యాబ్‌ల్లో పెంచే కోతులైతే.. వాటి వంశవృక్షం, జన్యు నేపథ్యం లాంటి పూర్తి సమాచారం సైంటిస్టుల దగ్గర ఉంటుంది. అలాగే పరిశోధనకు కావాల్సిన కచ్చితమైన వయసు, బరువు ఉన్న కోతులు బ్రీడింగ్ సెంటర్లలో లభ్యం అవుతాయి.


అడవి నుంచి కోతులను తెస్తే..?


వన్యప్రాణి సంరక్షణ చట్టాల ప్రకారం అడవుల నుంచి కోతులను పట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అడవుల నుంచి కోతులను పట్టుకున్నా సరే.. వాటిని బ్రీడింగ్ సెంటర్ల ఏర్పాటుకు లేదా సంతానోత్పత్తికి మాత్రమే వాడాలి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ కోతులకు పుట్టిన రెండో తరం పిల్లలను మాత్రమే క్లినికల్ ట్రయల్స్‌కు ఉపయోగించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa