హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఎయిర్ షో సందర్భంగా భారత్, రష్యా మధ్య జరిగిన రక్షణ చర్చలు జరిగాయి. రష్యాకు చెందిన ఐదో తరం అత్యాధునిక యుద్ధ విమానం సుఖోయ్ Su-57 (Su-57E)ను భారత్‌లో రెండు దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేసే అంశంపై ఇరు దేశాల మధ్య టెక్నికల్ చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు సంబంధించిన వివరాలను రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్(యూఏసీ) సీఈఓ వాడిమ్ బడెఖానా తెలిపారు. ప్రస్తుతం సుఖోయ్ Su-30MKI విమానాలను తయారు చేస్తున్న భారతీయ ప్లాంట్లలోనే.. భారతీయ విడిభాగాలు, వ్యవస్థలను ఉపయోగించి సుఖోయ్ Su-57 విమానాలను లైసెన్స్‌డ్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
అసలేంటీ Su-57 ప్రత్యేకత?
రష్యా తయారు చేసిన మొట్టమొదటి ఐదో తరం యుద్ధ విమానమే ఈ Su-57. ఇవి కేవలం శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండటమే కాకుండా.. గగనతలంలో అత్యంత వేగంగా, విన్యాసాలు చేయగల అద్భుత సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ధ్వని వేగం కంటే 2 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా చేధించగలదు. ఈ సుఖోయ్ 57 ఫైటర్ జెట్లు.. అడ్వాన్స్‌డ్ రాడార్ సిస్టమ్‌లు, హైపర్‌సోనిక్ మిసైల్‌లను ప్రయోగించగలవు.
సూపర్‌జెట్-100 తయారీపై ఒప్పందం
ఫైటర్ జెట్‌లతోపాటు రష్యాకు చెందిన సూపర్‌జెట్-100 (SJ-100) ప్రాంతీయ రవాణా విమానాల తయారీపై రష్యాకు చెందిన యూఏసీ, భారత్‌కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం.. ఈ సూపర్‌జెట్-100 విమానాల తయారీ, విక్రయం, మెయింటెనెన్స్‌కు అవసరమైన లైసెన్స్‌లను హెచ్ఏఎల్ దక్కించుకుంటుంది. ఈ విమానాలకు అవసరమైన విడిభాగాలను భారత్‌లో తయారు చేసి రష్యాకు కూడా సరఫరా చేసే అవకాశం ఉంది.
భారత్‌కు ఎందుకు కీలకం?
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్ల సంఖ్య తగ్గిపోతున్న వేళ రష్యాతో జరుపుతున్న చర్చలు తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. మన పొరుగు దేశమైన చైనా ఇప్పటికే తన జె-20 (J-20) స్టీల్త్ ఫైటర్లను మరింత పెంచుకుంటోంది. మరోవైపు.. భారత స్వదేశీ ఐదో తరం విమానం 'ఏఎంసీఏ' అభివృద్ధి దశలో ఉన్నందున.. అప్పటివరకు సుఖోయ్ Su-57 ఫైటర్ జెట్ ఒక వారధిగా ఉపయోగపడుతుందని రష్యా భావిస్తోంది. అయితే.. గతంలో ఇదే ప్రాజెక్ట్ (ఎఫ్‌జీఎఫ్‌ఏ) నుంచి భారత్ తప్పుకున్న నేపథ్యంలో.. టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఖర్చుల విషయంలో ఈసారి భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
కేవలం యుద్ధ విమానాలను విక్రయించడమే కాకుండా.. వాటిని భారత్ స్వయంగా తయారు చేసుకునేలా మేకిన్ ఇండియాకు కూడా సహకరిస్తామని.. స్వదేశీ ఏఎంసీఏ ప్రాజెక్టులో కూడా సాయం చేస్తామని రష్యా ప్రతిపాదించింది. దీనిపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa