ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా సెక్స్ కుంభకోణంలో మమ్దానీ తల్లి పేరు

international |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 08:35 PM

అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన అతిపెద్ద సెక్స్ కుంభకోణం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే అనేక మంది రాజకీయల నాయుకులు, సినీ ప్రముఖుల పేర్లు ఉండడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసిన సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, వేల సంఖ్యలో వీడియోలు, లక్షకు పైగా ఫోటోల్లో దిగ్గజ రాజకీయ నేతలు, టెక్ కుబేరులతో పాటు భారత సంతతికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జో బైడెన్, ట్రంప్ కుమార్తె ఇవాంక సహా ఎలాన్ మస్క్, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ తల్లి, ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు కూడా వినిపిస్తుండగా.. ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది.


ఘిస్లేన్ మాక్స్‌వెల్ ఇంట్లో పార్టీ..


2009లో మీరా నాయర్ దర్శకత్వం వహించిన అమేలియా సినిమా విడుదలైన సమయంలో.. ఎప్‌స్టీన్ ప్రధాన అనుచరురాలు, లైంగిక నేరాల్లో దోషిగా తేలిన ఘిస్లేన్ మాక్స్‌వెల్ నివాసంలో ఒక పార్టీ జరిగినట్లు ఈ పత్రాలు చెబుతున్నాయి. అలాగే 2009 అక్టోబర్ 21వ తేదీన పబ్లిసిస్ట్ పెగ్గి సీగల్.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు పంపిన ఒక ఈమెయిల్‌లో ఈ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాల గురించి ప్రస్తావించారు. ఆరోజు రాత్రి పార్టీ ముగిసిన వెంటనే పెగ్గి సీగల్ ఈ మెయిల్ పంపినట్లు ఆధారాలు కూడా లభించాయి.


బిల్‌ క్లింటన్, జెఫ్ బెజోస్ కూడా..


ఈ రహస్య పత్రాల్లోని ఈ మెయిల్ ప్రకారం.. ఘిస్లేన్ మాక్స్‌వెల్ నివాసంలో జరిగిన ఆ విందులో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌తో పాటు మీరా నాయర్ కూడా పాల్గొన్నారు. "నేను ఇప్పుడే ఘిస్లేన్ నివాసం నుంచి బయటకు వచ్చాను. అక్కడ సినిమా ఆఫ్టర్ పార్టీ జరిగింది. బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్, దర్శకురాలు మీరా నాయర్ తదితరులు అక్కడ ఉన్నారు" అని పెగ్గి సీగల్ తన మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే మీరా నాయర్ రూపొందించిన ఆ సినిమా పట్ల అతిథుల స్పందన అంతంతమాత్రంగానే ఉందని.. మహిళలు మాత్రం ఆ చిత్రాన్ని ఇష్టపడ్డారని ఆ మెయిల్‌లో రాశారు.


ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. 2012 నవంబర్‌లో ఎప్‌స్టీన్, మస్క్ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు కూడా ఇప్పుడు బయటపడ్డాయి. ఎప్‌స్టీన్ సొంత దీవికి హెలికాప్టర్‌లో ఎంతమంది వస్తున్నారని మస్క్‌ను ప్రశ్నించగా.. "నేను, తులాలా (మస్క్ మాజీ భార్య) వస్తున్నాం. మీ ఐలాండ్‌లో అన్నిటికంటే వైల్డెస్ట్ పార్టీ ఏ రోజు ఉంటుంది?" అని మస్క్ బదులు ఇచ్చినట్లు ఆ పత్రాల్లో ఉంది. ఈ సంభాషణలు అప్పట్లో ఎప్‌స్టీన్‌తో మస్క్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని వెల్లడిస్తున్నాయి.


ప్రకంపనలు సృష్టిస్తున్న 30 లక్షల పత్రాలు


జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణించినప్పటికీ.. ఆయనకు సంబంధించిన చీకటి సామ్రాజ్యం తాలూకు వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన 30 లక్షల పేజీల డాక్యుమెంట్లలో.. 1,80,000 ఫోటోలు, 2,000 వీడియోలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రముఖుల పేర్లు ఈ రికార్డుల్లో ఉండటంతో భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉంది. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కూడా ఎప్‌స్టీన్‌కు ఆహ్వానం అందిందనే వార్తలు ఈ పత్రాల ద్వారా బలాన్ని పుంజుకుంటున్నాయి.


పేరు ఉన్నంత మాత్రాన దోషులు కాదు..


న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేరు ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తులు లైంగిక నేరాలకు పాల్పడ్డారని లేదా అతడి అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములని అర్థం కాదు. కానీ ప్రపంచాన్ని వణికించిన ఒక సెక్స్ ట్రాఫికింగ్ నిందితుడి నెట్‌వర్క్‌లో అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలు ఉండటం మాత్రం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. న్యూయార్క్ రాజకీయాల్లో ఎదుగుతున్న జోహ్రాన్ మమ్దానీ తల్లి పేరు ఇందులో రావడంతో రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa