ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. అది ఏ దశలోనైనా చిగురించవచ్చని చాలా మంది చెబుతుంటారు. సినిమాల్లోనూ చూపిస్తుంటారు. అక్కడక్కడా వార్తల్లోనూ మనం ఇలాంటి మాటలు విన్నాం, కథలూ చూశాం. కానీ దీన్నే నిజం చేశాడో వృద్ధుడు. 97 ఏళ్ల వయసు కల్గిన ఆయన తన చిరకాల ప్రేయసిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే ఇతడికి పెళ్లై భార్య చనిపోగా, కొడుకు అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ వృద్ధుడు న్యాయ పోరాటం చేశాడు. చివరకు అందులో నెగ్గి తన ప్రియురాలిని ఈ వయసులో పెళ్లి చేసుకున్నాడు.
అర శతాబ్దపు అనుబంధం.. ఆస్తి తగాదా
జపాన్‌కు చెందిన ఓ కెమికల్ కంపెనీ అధినేతకు ప్రస్తుతం 97 ఏళ్లు. అయితే ఈయనకు 1950లో వివాహం కాగా.. ముగ్గురు కుమారులు జన్మించారు. అయితే 1971లో తన సెక్రటరీతో ప్రేమలో పడిన ఆయన.. ఆమెతో రహస్యంగా బంధాన్ని కొనసాగించారు. ఈ విషయం తెలిసినా ఆయన భార్య 2014లో మరణించే వరకు ఆయనతోనే ఉన్నారు. భార్య మరణం తర్వాత అంటే 2016లో ఆయన తన ప్రేయసిని ఇంటికి తీసుకువచ్చారు. అంతేకాకుండా గత 50 ఏళ్లుగా ఆమెతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయన.. 2021లో ఆమెను అధికారికంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
తండ్రి పెళ్లి చేసుకుంటే ఆస్తి ఎక్కడ ఆ పరాయి స్త్రీ పరం అవుతుందో అని భయపడిన రెండో కుమారుడు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. "మా నాన్నకు 2017లో కింద పడటం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. ఆయన నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. ఆ మహిళ మా నాన్నను మాయ చేసి ఆస్తి కొట్టేయాలని చూస్తోంది" అని ఆరోపించాడు. అయితే కోర్టులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. తండ్రికి మతిస్థిమితం లేదని చెబుతున్న ఇదే కుమారుడు.. 2019లో అదే తండ్రిని కంపెనీ సీఈఓగా నియమించడానికి అంగీకరించాడు. ఈ అంశాన్ని జడ్జి శోభా నాయర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ కొడుకు వాదనలో పస లేదని తేల్చారు.
కొడుకు వేసిన కేసుతో ఆగ్రహించిన ఆ 97 ఏళ్ల వృద్ధుడు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తన వీలునామా నుంచి రెండో కుమారుడిని, అతడు కొడుకైన తన మనవడిని తొలగించడమే కాకుండా.. వారి వద్ద ఉన్న దాదాపు 3.8 మిలియన్ సింగపూర్ డాలర్ల (సుమారు రూ. 25 కోట్లు) నగదును, కంపెనీ ఆస్తులను తిరిగి ఇచ్చేయాలని ఎదురు దాడి చేశారు. మరోవైపు వైద్య పరీక్షల్లో కూడా ఆయన మానసికంగా దృఢంగా ఉన్నారని, పెళ్లి విషయంలో తన నిర్ణయంపై స్పష్టతతో ఉన్నారని నిరూపితం అయింది. దీంతో కోర్టు కొడుకు పిటిషన్‌ను కొట్టేసింది. ప్రస్తుతం కొడుకు అప్పీలుకు వెళ్లడంతో.. ఆ 97 ఏళ్ల వరుడు తన పెళ్లి కోసం మరికొన్ని రోజులు ఆగక తప్పని పరిస్థితి ఏర్పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa