ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంజాయి నిందితుడికి 10 ఏళ్ల కఠిన శిక్ష పడటంపై హర్షం వ్యక్తం చేసిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 07:36 PM

మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా అనకాపల్లి ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గంజాయి స్మగ్లర్లకు కఠిన శిక్షలు పడేలా చేయడంలో రాజీ పడేది లేదని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 60 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో (http://Cr.No. 01/2016) నిందితుడైన శీర అప్పలనాయుడుకు చోడవరం తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు జడ్జి శ్రీ ఎం.హరినారాయణ గారు బుధవారం సంచలన తీర్పు వెలువరిస్తూ నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.1,00,000/-  జరిమానా విధించారు. ఈ తీర్పుపై జిల్లా ఎస్పీ గారు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, 2016లో నమోదైన ఈ కేసులో పక్కా ఆధారాలతో చార్జ్ షీట్ దాఖలు చేసి, నేరం రుజువు చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అప్పటి చీడికాడ ఎస్.ఐ ఎ.కోటేశ్వరరావు మరియు వారి సిబ్బందిని ఎస్పీ గారు కొనియాడారు.సాక్ష్యాధారాలను కోర్టులో సమర్థవంతంగా ప్రవేశపెట్టి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు మోనిటరింగ్ సెల్ సిబ్బందిని మరియు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ సి.హెచ్. సూర్యనారాయణ గారిని ఆయన అభినందించారు."గంజాయి సాగు చేసినా, విక్రయించినా లేదా రవాణా చేసినా ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల నియంత్రణలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి. పాత కేసుల్లో కూడా నిందితులకు కఠిన శిక్షలు పడేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం" అని ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు తెలిపారు.నిందితుడికి శిక్ష పడటం ద్వారా అక్రమ రవాణాకు పాల్పడే వారిలో భయం కలుగుతుందని, ఇది జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు మరియు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఎంతో దోహదపడుతుందని జిల్లా పోలీస్ యంత్రాంగం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa