ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు సీఎం ఆఫీసు సందేశాలు పంపొద్దు.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 07:20 PM

ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన సర్కారుకు కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అనధికారికంగా తీసుకుని, ప్రమోషనల్ మెసేజ్‌ల కోసం వినియోగిస్తోందన్న ఆరోపణలపై తక్షణమే వివరణ ఇవ్వాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత గోప్యతా హక్కు ఉల్లంఘనకు గురయ్యే ప్రమాదం ఉందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని 5.42 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది ప్రభుత్వ సంక్షేమ పింఛన్ల లబ్దిదారులు, 10 లక్షల మంది మహిళా భద్రతా పథకాల లబ్దిదారులు సమా మొత్తం 77 లక్షల మంది మొబైల్ నంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండా సేకరించారనే ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.


వాట్సాప్‌ మెసేజ్‌లతో ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడానికి సీఎంఓ సోషల్ మీడియా విభాగం ఈ డేటాను ఉపయోగించినట్టు పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ ఉద్యోగులకు మెసేజ్‌లు పంపొద్దని కేరళ సీఎం ఆఫీసును హైకోర్టు ఆదేశించింది. మరో కొద్ది రోజుల్లో బెంగాల్, తమిళనాడు సహా కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. పినరయి విజయన్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం తమ హయాంలో తీసుకున్న నిర్ణయాల గురించి వివరిస్తూ... సీఎం ఫోటోతో పాటు 10 శాతం డీఏ పెంపు వంటివి హైలెట్ చేస్తోంది.


వేతనం, పరిపాలనా ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించిన సర్వీస్ అండ్ పేరోల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోజిటరీ ఫర్ కేరళ (SPARK) పోర్టల్ నుంచి డేటానను ఐటీ మిషన్ ద్వారా సీఎంఓకి అనధికారిక బదిలీ గోప్యత హక్కు ఉల్లంఘనను ఎత్తిచూపుతోందని హైకోర్టు తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్ డేటాను రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించడం ఆర్టికల్ 21 కింద కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023కు పూర్తి విరుద్దమని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారిక స్పార్క్ డేటాబేస్‌‌ను సీఎం విజయన్ దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపణల చేస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. కేరళ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడుతోందని, ఇది వ్యక్గిగత గోప్యత ఉల్లంఘనే అంటు పలువురు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిని ఎందుకు పట్టించుకోవడం లేదని, సీపీఎంతో బీజేపీ కుమ్మక్కైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa