కొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండగా.. రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేసి, హామీలు గుప్పిస్తున్నాయి. ఉచితాలకు పుట్టినిల్లు అయిన తమిళనాడులో ఎన్నికలకు ముందు మరిన్ని కొత్త పథకాలు పుట్టుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా, ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే భారీ వాగ్దానాలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందిస్తామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంగళవారం ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత 75వ జయంతి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారం, వివిధ రంగాలలోని ప్రజలకు ఉపశమనం కల్పించడానికి అన్నాడీఎంకే అనేక హామీలు గుప్పిస్తోంది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంచ్‌లో పేరు నమోదు చేసుకుని ఉద్యోగం లభించని వారికి నెలకు రూ. 2,000, ప్లస్ టూ ఉత్తీర్ణులైన వారికి రూ. 1,000 అందజేస్తామని ప్రకటించింది. అలాగే, మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో ప్రస్తుతం ఇస్తున్న రూ.8,000ను.. తాము అధికారంలోకి వస్తే రూ.10,000 కు పెంచుతామని పళనిసామి తెలిపారు. చేనేత కార్మికులకు ప్రత్యేక ఆర్థిక సహాయం కూడా అందజేయనున్నట్టు చెప్పారు.
డీఎంకే ప్రభుత్వం ప్రతి మహిళ ఖాతాకు రూ.5,000 జమ చేసింది. దీనికి పోటీగా అన్నాడీఎంకే పలు వాగ్దానాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలతో పాటు విజయ్ పార్టీ టీవీకే కూడా వాగ్దానాల్లో పోటీ పడుతోంది. ఉచిత హామీలు, సంక్షేమ పథకాల ద్వారా ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయడం వల్ల ఖజానాపై భారీ ఆర్థిక భారం పడుతుందని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ తమిళ పార్టీలు మాత్రం తగ్గేదిలే అంటున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఉచితాలపై తీవ్రంగా స్పందించింది. పంచుకుంటూ పోతే.. అభివృద్ధికి ఒక్క పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ప్రజలు పనిచేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదని రాజకీయ పార్టీలు ఇచ్చే వాగ్దానాలపై మండిపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa