ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడుల వెనుక కేవలం రాజకీయ కారణాలే ఉన్నాయని అనుకుంటే పొరపాటే. దీని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఒక భారీ ఆర్థిక కుట్ర ఉందని కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనాలోని ఒక చిన్న వాణిజ్య బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ కున్లున్ కేంద్రంగా సాగుతున్న ఈ రహస్య లావాదేవీలే ఇప్పుడు అగ్రరాజ్యానికి కంటగింపుగా మారాయి.
ఏమిటీ 'క్లోజ్డ్ లూప్' వ్యూహం?
మెగ్నమ్ ఫిన్వెస్ట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు సౌరభ్ జైన్ వివరణ ప్రకారం.. చైనా చాలా తెలివిగా 'పేమెంట్ లూప్' అనే వ్యవస్థను సృష్టించింది. దీని ద్వారా డాలర్లతో అస్సలు పని లేకుండానే ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇరాన్ నుంచి నెలకు సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన చమురును చైనా కొనుగోలు చేస్తోంది. కానీ చెల్లింపులు మాత్రం యువాన్ కరెన్సీలో జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్ చమురును మలేషియా చమురుగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో మార్చి రవాణా చేస్తున్నారు.
డాలర్‌కు నో ఎంట్రీ!
ఈ రహస్య వ్యవస్థలో 'బ్యాంక్ ఆఫ్ కున్లున్' కీలక పాత్ర పోషిస్తోంది. ఇరాన్ తన చమురును చైనాకు అమ్ముతుంది. ఆ డబ్బు యువాన్ల రూపంలో కున్లున్ బ్యాంక్ ఖాతాల్లో పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌పై ఆంక్షలు ఉండటంతో.. ఆ డబ్బును ఇరాన్ వేరే దేశాల్లో ఖర్చు చేయలేదు. ఫలితంగా ఇరాన్ ఆ యువాన్లతో మళ్లీ చైనా నుంచే యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే చైనా నుంచి వెళ్లిన డబ్బు మళ్లీ వస్తువుల రూపంలో చైనాకే చేరుతోంది. దీనివల్ల అమెరికా డాలర్ అవసరమే లేకుండా వ్యాపారం నిరాటంకంగా సాగిపోతోంది.
అమెరికా ఎందుకు ఉలిక్కిపడుతోంది?
ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం చైనాకే వెళ్తున్నాయి. అది కూడా బ్యారెల్‌కు 10 డాలర్ల తగ్గింపు ధరతో. ఈ రకమైన 'బార్టర్ సిస్టమ్' (వస్తు మార్పిడి పద్ధతి) వల్ల అంతర్జాతీయంగా డాలర్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు వంటిది. అందుకే 2012లోనే అమెరికా ఈ బ్యాంక్‌పై ఆంక్షలు విధించినా.. చైనా మాత్రం తన 'హై-రిస్క్' వ్యాపారాల కోసం దీనిని ఒక ప్రత్యేక మార్గంగా వాడుకుంటూనే ఉంది.
ఇరాన్ యుద్ధంతో చమురు ధరలు పెరగడం మొదలయ్యాక.. చైనా యువాన్ విలువ తగ్గింది. అంతర్జాతీయ పరిణామాలతో ధరలు తగ్గినట్లు అనిపించినప్పటికీ.. చైనా ఓ ప్లాన్ ప్రకారమే యువాన్ విలువను తగ్గించి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యువాన్ విలువ తగ్గడం వల్ల చైనా ఎగుమతులు పెరుగుతాయి. దీని వల్ల నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. అంతే కాదు చైనాకు ఇరాన్ ఎంత అవసరమో.. ఇరాన్‌కు చైనా అంతకు మించి అవసరం. ఒకవేళ పశ్చిమాసియాలో ఘర్షణలు త్వరగా తగ్గితే గనుక.. పెట్టుబడులు, టెక్నాలజీ, దౌత్యం.. ఇలా ఎన్నో విధాలుగా చైనాపై ఇరాన్ ఆధారపడక తప్పని పరిస్థితి. అదీగాక ఎవరెటు పోయినా, తన ఆర్థిక ప్రయోజనాలే డ్రాగన్‌కు ముఖ్యం. అందుకే చైనా శాంతం శాతం అంటోందే గానీ.. ఇరాన్‌కు మద్దతుగా రంగంలోకి దిగడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa