ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ ‘ప్లాస్టిక్ డ్రోన్’ ఎత్తులతో అమెరికా, ఇజ్రాయెల్‌ టెక్నాలజీలు చిత్తు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:48 PM

అమెరికా-ఇజ్రాయెల్‌, దాని మిత్ర దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. గతవారం టెహ్రాన్‌ సహా ఇరాన్‌ నగరాలపై అమెరికా-ఇజ్రయెల్ సంయుక్త దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తమ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో రగిలిపోయిన ఇరాన్..పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాల ఆర్థిక మూలాలపై విరుచుకుపడుతోంది.అమెరికా, ఇజ్రాయెల్ అధునాతన సాంకేతికతలను, రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ సాగుతోంది. ప్రస్తుత ఘర్షణలో సంప్రదాయ యుద్ధ రీతుల స్థానంలో డ్రోన్లు కీలకంగా మారాయి. సాధారణంగా లోహాలతో తయారయ్యే క్షిపణులు, ఫైటర్ జెట్‌లను రాడార్లు సులువుగా గుర్తిస్తాయి. అయితే, ఇరాన్ యుద్ధ తంత్రం అమెరికా, ఇజ్రాయెల్‌‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.‌


‘ప్లాస్టిక్ - కార్బన్ ఫైబర్’ వంటి పదార్థాలతో తయారు చేసిన కామికాజ్ డ్రోన్లు (ఆత్మాహుతి డ్రోన్లు , Shahed-136) ఇరాన్ ప్రయోగిస్తోంది. రాడార్ సిగ్నల్స్‌ వీటిని గుర్తించలేకపోవడంతో అత్యాధునిక రక్షణ వ్యవస్థలు సైతం లక్ష్యానికి అతి సమీపంలోకి వచ్చే వరకు డ్రోన్ల ఉనికి పసిగట్టలేకపోతున్నాయి. దీంతోఇరాన్, దాని ప్రాక్సీలు ఈ డ్రోన్ల ద్వారా అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాలు, యుద్ధ నౌకలపై దాడిచేసి, తక్కువ ఖర్చుతో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ షాహెద్ సిరీస్ డ్రోన్లు పెద్ద పేలోడ్‌ను మోసుకెళ్లి, చాలా దూరం ప్రయాణించగలవు. చాలా ఖరీదైన లక్ష్యాలను ఛేదించగలవు. ఆధునిక క్రూయిజ్ క్షిపణి చేయగలిగే పనిని అవి తక్కువ ఖర్చుతో చేయగలవు.


పరిమాణంలో చిన్నవిగా ఉండే ఈ డ్రోన్లు.. భూమికి అతి తక్కువ ఎత్తులో ఎగురుతుండటం వల్ల 'స్టెల్త్' సామర్థ్యాన్ని పొందుతాయి. ఒక్కో డ్రోన్ తయారీకి కేవలం 30- 40 డాలర్లు మాత్రమే ఖర్చవుతుండగా, వాటిని కూల్చడానికి అమెరికా ప్రయోగిస్తున్న క్షిపణుల ఖర్చు 2- 4 మిలియన్ డాలర్లు ఉంటోంది. అంటే, ఆర్థికంగానూ అమెరికాను దెబ్బకొట్టేందుకు ఇరాన్ ఈ వ్యూహాన్నిఅనుసరిస్తోంది. రాడార్లకు చిక్కకుండా దెబ్బ తీస్తున్న ఈ ప్లాస్టిక్ శత్రు డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా లుకాస్ డ్రోన్లను రంగంలోకి దించుతోంది. ఇవి అచ్చం ఇరాన్‌ డ్రోన్లను పోలి ఉండటం గమనార్హం. లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థల చేరికతో ఈ సాంకేతిక యుద్ధం మధ్య ఆసియాలో పోరాట దిశను పూర్తిగా మారిపోనుంది.


అయితే, Shahed-136 ఆత్మాహుతి డ్రోన్లు, అమెరికా LUCAS drone యుద్ధరంగంలో సాంప్రదాయ ఆయుధాల కంటే చాలా తక్కువ వ్యయంతో అసమాన నష్టం కలిగిస్తున్నాయి. భారత్ కూడా ఈ తరహాలో శేషనాగ్-150 డ్రోన్లు అభివృద్ధి చేస్తోంది. దీనికి ఇరాన్ డ్రోన్లు షహెద్-136 స్పూర్తి. ఆపరేషన్ సిందూర్ సమయంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇవి తన సామర్థ్యాన్ని మించి ప్రభావం చూపుతాయి. భారీ సంఖ్యలో ఒకేసారి దాడులు చేసి వైమానిక రక్షణ వ్యవస్థలను ముంచెత్తడం, అత్యల్ప ఖర్చుతో అత్యంత విలువైన లక్ష్యాలను దెబ్బతీయడం దీని ప్రత్యేకత. అమెరికా కూడా ఇరాన్‌నే కాపీ కొట్టి లుకాస్ డ్రోన్లను తయారుచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa