ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

Crime |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 07:53 PM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు శివారులో వేగంగా వచ్చిన కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టి దాని కిందకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైవేపై స్లోగా వెళ్తున్న లారీని, కారు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఆ దాటికి లారీ 200 మీటర్ల దూరం ముందుకు కదిలింది. బెంగళూరుకు చెందిన ఓ కుటుంబం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శన నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు లారీ కింద ఇరుక్కొని నుజ్జునుజ్జయ్యింది. వాహనంలో మృతదేహాలు చిక్కుకుపోయాయి. జేసీబీ సాయంతో కారును బయటకి తీసి, మృతదేహాలను తీసుకొచ్చారు.


  ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతి చెందిన వారిని 33 ఏళ్ల పూజ, 59 ఏళ్ల జయంతి, 61 ఏళ్ల కుసుమ, 61 ఏళ్ల నాగరాజారావు, 71 ఏళ్ల మోహన్ దాస్‌గా పోలీసులు గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం జరగ్గానే స్థానికులు పరుగెత్తుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.


లారీ పలమనేరు నుంచి నెల్లూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు బెంగళూరు నగరంలోని రాజాజీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బంధువులకు సమాచారం ఇచ్చారు. పలమనేరు రోడ్డు ప్రమాదం ఘటన గురించి తెలియగానే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


తిరుపతి జిల్లాలో యువకుడు మృతి


తిరుపతి జిల్లాలో ఓ యువకుడు అతిగా మద్యం తాగా కాలువలో పడి చనిపోయాడు. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటో డ్రైవర్ దివాకర్ స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి మద్యం సేవించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మళ్లీ మద్యం కొనడానికి డబ్బులు కావాలని భార్యతో గొడవపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి లిక్కర్ షాపునకు వెళ్లి మద్యం కొనుగోలు చేశాడు. అయితే మురుగుకాలువ దగ్గర పడి చనిపోయాడు. మంగళవారం రోజు పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు యువకుడి మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే చనిపోయిన యువకుడు షర్ట్ లేకుండా ఉండటంపై అనుమానాలువ్యక్తమయ్యాయి. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఘటనా స్థలానికి సమీపంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వృద్ధుడు చెరువులో పడి చనిపోయాడు. స్థానికంగా ఆవుల మేపుతూ జీవనం సాగిస్తున్న గంగాధరం చిత్తూరు రూరల్ మండలం బండపల్లిలో చెరువు దగ్గర సాయంత్రం కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు జారిపడి నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa