టీ20 ప్రపంచకప్‌లో దారుణమైన ఆటతీరుతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు, ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. శ్రీలంకతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌కు ముందు ఒక పాకిస్థాన్ ఆటగాడు బస చేసిన హోటల్లో హౌస్ కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. మైదానంలో ఆటతో నిరాశపరిచిన జట్టు, మైదానం బయట క్రమశిక్షణారాహిత్యంతో వార్తల్లో నిలవడం అభిమానులను మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ఈ ఘటన జట్టు ప్రతిష్టను మరోసారి దిగజార్చేలా ఉంది.
సదరు ఆటగాడు అనుచితంగా ప్రవర్తించడంతో భయపడిన సదరు మహిళా సిబ్బంది ఒక్కసారిగా కేకలు వేసినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన ఇతర హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హోటల్ యాజమాన్యం, పాకిస్థాన్ జట్టు మేనేజర్ నవైద్కు ఫిర్యాదు చేసింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు మేనేజర్ వెంటనే జోక్యం చేసుకుని, సదరు ఆటగాడి తరఫున హోటల్ సిబ్బందికి క్షమాపణలు చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమశిక్షణారాహిత్య చర్యపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, సదరు ఆటగాడికి ఇప్పటికే భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. టోర్నీ నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై బోర్డు ముందు పూర్తిస్థాయి విచారణ జరగనుంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే, ఆ ప్లేయర్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని బోర్డు వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. జట్టు పతనావస్థలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పిసిబికి తలనొప్పిగా మారింది.
ప్రపంచకప్‌లో వరుస ఓటములతో కుంగిపోయిన పాకిస్థాన్ అభిమానులు, ఈ తాజా వివాదంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటపై దృష్టి పెట్టకుండా ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్లేయర్లపై మండిపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం జట్టు నైతిక విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ వివాదం పాక్ క్రికెట్లో రాబోయే రోజుల్లో పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa