ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం.. 28 ఏళ్ల యువకుడు అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 10:25 PM

Hoax Bomb Threat: వరుసగా నకిలీ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతూ కలకలం రేపిన యువకుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఇప్పటివరకు 50కి పైగా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు వెల్లడించారు.గత ఐదు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాలకు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై, ఢిల్లీతో పాటు గుజరాత్ మరియు ఇతర రాష్ట్రాల్లోని అనేక సంస్థలకు ఈ మెయిల్స్ పంపినట్లు గుర్తించారు.పాఠశాలలు, మెట్రో స్టేషన్లు, ముంబై స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి కీలక ప్రదేశాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపై ముంబై, గుజరాత్ సహా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. కేసును సీరియస్‌గా తీసుకున్న గుజరాత్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల విచారణలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 28 ఏళ్ల సౌరవ్ విశ్వాస్ ఈ మెయిల్స్ పంపినట్లు బయటపడింది. వెంటనే గుజరాత్ క్రైమ్ బ్రాంచ్, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా అతడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. చివరకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 27న ముంబైలోని పలు పాఠశాలలకు సౌరవ్ విశ్వాస్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపాడు. రెండు రోజుల్లో బాంబులు పేల్చేస్తానని హెచ్చరికలు జారీ చేశాడు. అలాగే పలు స్కూల్స్, మెట్రో స్టేషన్లు, ఇతర సంస్థలకు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్స్ పంపినట్లు గుర్తించారు.ఈ మెయిల్స్ కారణంగా ఆయా ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మొత్తం 50కి పైగా మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం, ముంబై పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa