రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చిందన్న వార్తలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఉన్నాయంటూ రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. తాజాగా నటుడు, రాజ్యసభ ఎంపీ, మక్కల్ నీది మయ్యం (ఎమ్ఎన్ఎమ్) అధినేత కమల్ హాసన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కమల్ హాసన్ పదునైన విమర్శలు..
"డియర్ మిస్టర్ ప్రెసిడెంట్.. భారత ప్రజలమైన మేము ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశానికి చెందిన వారం. విదేశీ తీరాల నుంచి వచ్చే ఆజ్ఞలను మేము పాటించం. దయచేసి మీ పని మీరు చూసుకోండి" అంటూ కమల్ హాసన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ట్రంప్‌కు చురకలు అంటించారు. దేశాల మధ్య పరస్పర గౌరవం ఉంటేనే ప్రపంచ శాంతి సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. హార్మూజ్ జలసంధి మార్గంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. భారత్ తన చమురు దిగుమతులను 27 దేశాల నుంచి 40 దేశాలకు విస్తరించిందని, ఇంధన సరఫరా స్థిరంగా ఉందని స్పష్టం చేసింది. భారత్ ఏ దేశం అనుమతి పైనా ఆధార పడలేదని అధికారులు తెలిపారు. మరోవైపు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత విదేశాంగ విధానం ప్రజల అభీష్టం మేరకు ఉండాలని, కానీ ప్రస్తుత పరిస్థితులు అణచివేతకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసలీ వివాదం ఏమిటి?
అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "భారతీయులు మంచి పాత్రధారులు. గతంలో మేము కోరినట్లుగా రష్యా చమురు కొనడం ఆపారు. అయితే ప్రస్తుత ఇంధన సంక్షోభం దృష్ట్యా రష్యా నుంచి చమురు తీసుకోవడానికి మేము వారికి అనుమతి ఇచ్చాం" అని పేర్కొన్నారు. దీనిపై ట్రంప్ కూడా స్పందిస్తూ.. భారత్‌పై ఒత్తిడి తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అమెరికా వద్ద అపారమైన చమురు నిల్వలు ఉన్నాయని.. ధరలు పెరిగినా తమకు బెంగేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa