ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫామ్‌హౌస్‌లో నల్లమందు సాగు చేస్తున్న బీజేపీ నేత

national |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 07:17 PM

ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. అధికార బీజేపీకి చెందిన ఒక కీలక నాయకుడు.. ఏకంగా తన ఫామ్‌హౌస్‌లోనే అక్రమంగా నల్లమందు సాగు చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దుర్గ్ జిల్లాకు చెందిన బీజేపీ నేత వినయ్ తామ్రకర్ లీజుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో.. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ నిషేధిత పంటను సాగు చేస్తున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది. ఈ ఘటన పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించడంతో.. బీజేపీ అధిష్ఠానం సదరు నాయకుడిపై తక్షణమే సస్పెన్షన్ వేటు వేసింది.


రహస్యంగా నల్లమందు దందా..


దుర్గ్ జిల్లా సమోద గ్రామంలో వినయ్ తామ్రకర్‌కు చెందిన ఫామ్‌హౌస్‌పై పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. లీజుకు తీసుకున్న భూమిలో ఇతర పంటల చాటున అత్యంత రహస్యంగా నల్లమందును పండిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు ఒకటిన్నర ఎకరాకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ పంటను చూసి అధికారులు సైతం విస్తుపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వినయ్ తామ్రకర్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సాగు వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.


బీజేపీ కఠిన నిర్ణయం..


వినయ్ తామ్రకర్ కేవలం సాధారణ కార్యకర్త మాత్రమే కాదు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయి 'రైస్ మిల్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్' కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. ఇలాంటి అక్రమాలకు పాల్పడటంపై ఛత్తీస్‌గఢ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ సింగ్ దేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ మార్చి 7వ తేదీన ఆయన్ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


డ్రగ్స్ రహిత రాష్ట్రం అంటూనే.. నల్లమందు సాగా?


ఈ ఘటనపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. "డ్రగ్స్ రహిత రాష్ట్రం" అని నిరంతరం చెప్పే బీజేపీ నేతలే ఇలాంటి దందాలకు పాల్పడటం ఏంటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ సాగు ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తోందో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa