ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రపతి బెంగాల్‌ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం

national |  Suryaa Desk  | Published : Sun, Mar 08, 2026, 07:21 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ప్రొటోకాల్‌ వైఫల్యం తీవ్ర దుమారం రేపుతోంది. ఉత్తర బెంగాల్‌లో అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు ద్రౌపది ముర్ము హాజరుకాగా... ఆమెకు స్వాగతం పలకడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ హాజరుకాలేదు. దీనిపై ముర్ము తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి లేదా వారి మంత్రుల నుంచి తనకు అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. అంతేకాదు, తాను చీఫ్ గెస్ట్‌గా హాజరు కావాల్సిన అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని నిలదీశారు. అయినప్పటికీ తనకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఎటువంటి ద్వేషం లేదన్న ముర్ము.. ఆమె సోదరితో సమానమని అన్నారు.


అంతర్జాతీయ సంతాల్ సదస్సు వేదికను బిధాన్‌నగర్ నుంచి గోసాయిపూర్‌కు ఎందుకు మార్చారని ముర్ము ప్రశ్నించారు. బెంగాల్‌లో నిర్వహించే ఈ సదస్సులో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిలిగురికి వెళ్లారు. ప్రొటోకాల్‌ ప్రకారం రాష్ట్రపతికి ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. కానీ, బెంగాల్ ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు. మమతా బెనర్జీ , ఆమె మంత్రులు దూరంగా ఉన్నారు. సిలిగురి మేయర్ దేవ్ రాష్ట్రపతికి స్వాగతం పలికారు.


ముందుగా నిర్ణయించిన ప్రకారం బిధాన్‌నగర్‌లో ఈ సదస్సు జరగాల్సి ఉంది. కానీ, భద్రతా కారణాలతో బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్ట్ సమీపంలోని గోసాయిపూర్‌కు మార్చారు. తన పర్యటన వేదిక మార్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ.. ఇక్కడకు చాలా సులభంగానే వచ్చాను, కానీ, జనసమ్మర్ధం ఎక్కువగా ఉంటుందనే వేదికను మార్చినట్టు అధికార యంత్రాంగం తనకు వివరించిందని అన్నారు. ‘‘రాష్ట్రపతి జనసమర్ధం లేని చోటుకు వచ్చిన కార్యక్రమంలో పాల్గొని వెళ్లిపోతారని వారు భావించా ఉంటారు. వాళ్ల ఆలోచన ఏంటో నాకు తెలియదు. అయినా ఇది చాలా బాధాకరంగా ఉంది’ అని అన్నారు. తాను బెంగాల్‌కు కుమార్తెనే అని ఆమె వ్యాఖ్యానించారు.


ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ముర్ము మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. రాష్ట్రపతిని పశ్చిమ్ బెంగాల్‌ ప్రభుత్వం అవమానించిందని ఆయన ఆరోపించారు. ఇది అసాధారణ ఘటన అని, టీఎంసీ సర్కారు అన్ని హద్దులు దాటిందని మోదీ విమర్శించారు. రాజకీయాలకు అతీతమైన రాష్ట్రపతి పదవి పవిత్రతను ఎల్లప్పుడూ గౌరవించాలని వ్యాఖ్యానించారు. సంతాల్ సంస్కృతి వంటి ముఖ్యమైన అంశాన్ని బెంగాల్ ప్రభుత్వం చాలా తేలికగా తీసుకోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.


‘‘ఇది సిగ్గుచేటు.. అసాధారణ చర్య.. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కలత చెందారు. గిరిజన సమాజానికి చెందిన రాష్ట్రపతి జీ వ్యక్తం చేసిన ఆవేదన భారతీయులందర్నీ విచారానికి గురిచేసింది’’ అని ప్రధానమంత్రి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa