ఈ ఎండాకాలంలో మీరు మీ ఇంట్లో ఏసీ పెట్టించుకోవాలనుకుంటున్నారా? మంచి కంపెనీ ఏసీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. దిగ్గజ కంపెనీలన్నీ ఏసీల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు చూపుతూ ఏసీ తయారీ కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయి. రవాణా ఖర్చులు, కొత్త ఇంధన వినియోగ నిబంధనలు సైతం ధరలు పెంచేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచగా ఇప్పుడు మరికొన్ని కంపెనీలు అదే దారిలో నడుస్తున్నాయి. డైకిన్, బ్లూస్టార్, వోల్టాస్, ఎల్‌జీ, హైయర్, మిత్సుబిషి వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
ప్రముఖ ఏసీల తయారీ సంస్థ డైకిన్ తమ కంపెనీకి చెందిన ఏయిర్ కండీషనర్ల ధరలను 12 శాతం వరకు పెంచుతోంది. మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని, ఏప్రిల్ నుంచే ఈ పెంపు అమలులోకి వస్తుందని డైకిన్ ఇండియా ఛైర్మన్, ఎండీ కన్వల్జీత్ జావా పేర్కోన్నారు. ఏసీల తయారీలో వినియోగించే రాగి వంటి ముడి సరకుల ధరలు పెరగడంతో పాటుగా కొత్త ఇంధన నిబంధనల కారణంగా ధరలు పెంచాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల సరకు రవాణా ఖర్చులు పెరగడంతో ప్రత్యామ్నాయం లేక ఏసీ ధరలు పెంచాల్సి వస్తోందని తెలిపారు. ప్రతి ఏసీ కంపెనీది ఇదే పరిస్థితి గా తెలుస్తోంది. ఈ సంవత్సరం ఏసీల విక్రయాల్లో 15 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనాలు ఉన్నాయి.
మరో ఏసీ తయారీ కంపెనీ బ్లూస్టార్ ఇప్పటికీ అంటే గత ఫిబ్రవరి నెలలోనే ఏసీల ధరలను 8-10 శాతం పెంచిన సంగతి తెలిసింది. అయితే పాత ధరల ఇన్వెంటరీ ఇప్పటికీ మార్కెట్లో ఉన్న కారణంగా రేట్లలో పెద్దగా తేడా ఉండదని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బి. త్యాగరాజన్ తెలిపారు. ఏసీల ధరల పెరుగుదల ఊహించి డీలర్లు ముందుగానే స్టాక్ పెట్టుకుని, వాటిని విక్రయిస్తున్నారని చెప్పారు. కొత్త స్టాక్ పై మాత్రం ధరల ప్రభావం ఉంటుందని తెలిపారు.
టాటా గ్రూప్‌నకు చెందిన వోల్టాస్ సైతం 5-15 శాతం మేర ఏసీల ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. గడిచిన కొన్ని నెలలుగా రాగి ధరలు పెరుగుతున్నాయి. రూపాయి విలువ పతనం అవ్వడం వంటి కారణాలతో రేట్లు పెంచాల్సి వస్తోంది వోల్టాస్ ఎండీ తెలిపారు. దీంతో పాటు ఎల్‌జీ సంస్థ 3 స్టార్ ఏసీలపై 7 శాతం, 5 స్టార్ మోడళ్లపై 9-10 శాతం చొప్పున ధరల పెంచుతున్నట్లు వెల్లడించింది. హైయర్ ఇండియా సైతం 5-8 శాతం మధ్య ధరలు పెంచుతున్నట్లు ఆ కంపెనీ ప్రెసిడెంట్ సతీష్ పేర్కొన్నారు. మిత్సుబిషి ఏసీ ధరలు 5 శాతం మేర పెరగనున్నాయని ఆ కంపెనీ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa