ఆక్సిజన్ కొరత సమస్యను పరిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే మహా విషాదం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ శుక్రవారం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నీతీ ఆయోగ్ హెల్త్ మెంబర్ వీకే పాల్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్షవర్ధన్, ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అశోక్ గెహ్లాట్, బీఎస్ యడియూరప్ప, పినరయి విజయన్, శివరాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ, భూపేష్ బాఘేల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఆ రాష్ట్రం తరపున ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ పాల్గొన్నారు.
కోవిడ్-19 మహమ్మారి కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత గురించి వివరించారు. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరారు. పరిస్థితి చేయి దాటిపోతే మహా విషాదం తప్పదని చెప్పారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు లేవని, అందువల్ల తమకు ఆక్సిజన్ ఇవ్వరా? అని అడిగారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల రోగి కొన ఊపిరితో ఉన్నపుడు, ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలో చెప్పాలని కోరారు. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా జరగకుండా ఇతర రాష్ట్రాలు నిరోధిస్తున్నాయని ఆరోపించారు. ఆక్సిజన్ రవాణా వాహనాలను కొన్ని రాష్ట్రాలు నిలిపేస్తున్నాయని, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాలని మోదీని కోరారు. ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
తాను ముఖ్యమంత్రినైనప్పటికీ ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా నిద్రపట్టడం లేదన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తనను క్షమించాలని కోరారు. ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలన్నారు. అదేవిధంగా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని కోరారు.
సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రకటించిన ధరల ప్రకారం ఒక మోతాదు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వానికి రూ.150కి, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు రంగానికి రూ.600కు విక్రయిస్తారు. ఈ విధంగా వేర్వేరు ధరలను నిర్ణయించడంపై కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa