ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులను దగా చేసిన ఆయనను ప్రజలు క్షమించరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 01:59 PM

తమది దేశభక్తి పార్టీ జాతీయ పార్టీ అని చెప్పుకునే బిజెపి దేశవ్యాప్తంగా ఉన్న కర్షకులను దగా చేసిందని ఈ ద్రోహాన్ని ప్రజలు క్షమించరని అఖిలభారత రైతు కూలీ సంఘం చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షులు పి. వెంకటరత్నం అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో విద్రోహ దినం పాటిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా పి. వెంకట రత్నం మాట్లాడుతూ అన్నదాతలను కార్పొరేట్ శక్తులకు అమ్మేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మండుటెండను, చలిని, వర్షాలను లెక్క చేయకుండా దేశ చరిత్రలోనే ఎన్నడు కనివిని ఎరుగని పోరాటాన్ని రైతులు చేశారన్నారు. ఈ పోరాటంలో 750 మంది రైతులు అమరులయ్యారని ఆయన చెప్పారు. రైతుల ఆగ్రహాన్ని చవిచూసిన మోడీ ప్రభుత్వం భయపడి మూడు చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీతో రైతులు ఉద్యమాన్ని విరమించినా మోడీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తిరిగి రద్దు చేసిన మూడు చట్టాలను తీసుకువస్తామని ప్రకటించడం దుర్మార్గమన్నారు. లఖింపూర్ ఖేర్ ఘటనకు బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేయడానికి నిరసనగా నేడు విద్రోహ దినంగా పాటిస్తున్నామన్నారు. ఐఎఫ్టీయూ నగర కమిటీ నాయకుడు పి. లోకేష్ మాట్లాడుతూ రైతులు, కూలీలు, కార్మిక వర్గం శ్రమ, నిరంతర కృషితో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. అయితే పాలకులు అనుసరిస్తున్న విధానాలు, చేస్తున్న సంస్కరణలుదేశాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడం అంటే, దేశాన్ని గంపగుత్తగా అమ్మేయడమే అవుతుందన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం) న్యాయమైన డిమాండ్లను కేంద్రం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ నగర కమిటీ నాయకులు కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర నిర్ణయించడానికి వెంటనే కమిటీ వేయాలన్నారు. ఉద్యమంలో అమరులైన రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, నూతన విద్యుత్ బిల్లుల పై రైతులతో చర్చించాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు గంగాదేవి, పిడిఎస్యూ నాయకులు మహేష్, ఆశా వర్కర్స్ ఫెడరేషన్ నాయకురాలు కవిత, ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకుడు రాజ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ వారు నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa