కృష్ణా జిల్లా: ఘంటసాల మండలంలో గృహాలు నిర్మించుకొని లబ్ధిదారులకు సచివాలయం నుంచి నోటీసులు అందించటం సబబు కాదని, లబ్దిదారులు అసలు ఎందుకు సంజాయిషీ ఇవ్వాలో అధికారులే తెలపాలని సీపీఎం సీనియర్ నాయకులు వాకా రామచంద్రరావు పేర్కొన్నారు. మంగళవారం ఘంటసాలలో ఆయన మాట్లాడుతూ. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పధకంలో నివేశనా స్థలాలు ఇచ్చి జనవరి 2022లోగా నిర్మాణాలు ఎందుకు చెప్పట్టలేదో తెలపాలని, మీపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని నోటీసులు ఇవ్వటం దారుణం అన్నారు. అసలు ప్రభుత్వ లే అవుట్లలో సరైన వసతులు ఉన్నాయా అని అధికారులను ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చి లబ్దిదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని, అనారోగ్య సమస్యలు ఉన్న పేదలకు ఏమైనా అయితే ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.
ప్రభుత్వం స్వయంగా తామే గృహ నిర్మాణాలు చేసి ఇస్తామని మాట ఇచ్చి నేడు మీరే గృహాలు నిర్మించుకోవాలని అనటం భావ్యం కాదన్నారు. మూడు అప్షన్ల పేరుతో ప్రభుత్వం పేదలను మోసం చేసిందన్నారు. ఇతర ఖర్చులు పెరగటంతోపాటు తాపీ మేస్త్రికి వెయ్యి రూపాయలు, కూలికి 800 ఖర్చవుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే1. 80 లక్షలతో గృహ నిర్మాణం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలి అన్నారు. గృహ నిర్మాణం చేపట్టాలంటే రూ. 5 నుంచి రూ. 7 లక్షల వరకు అవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి కనీసం మూడు లక్షలు ఇస్తే తప్ప లబ్ధిదారుడు గృహ నిర్మాణం చేసుకోవడం అసాధ్యమన్నారు. ప్రభుత్వం లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించి బలవంతపు గృహ నిర్మాణాలకు పూనుకుంటుందని అన్నారు. మండల పరిధిలోని శ్రీకాకుళంలోని లబ్ధిదారులకు గోగినేనిపాలెంలో నివేశన స్థలాలు కల్పించడం అధికారులకు తగునా అన్నారు. కేవలం రైతులు, రెవిన్యూ అధికారులు కుమ్మక్కై నివేశన స్థలాలు గోగినేనిపాలెం శివారుల్లో ఇచ్చారని అన్నారు. లబ్దిదారులను అప్పుల ఊబిలోకి నెట్టి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు సైతం గృహ నిర్మాణం చేసుకోకపోతే వేరొకరికి నివేశనా స్థలాలు కేటాయిస్తామని చెబుతున్నారన్నారు. నిర్మాణాలు చేపట్టిన లబ్దిదారులకు మొదటి విడత బిల్లులు పూర్తి స్థాయిలో పడలేదని, ఇంకా ఏలా గృహ నిర్మాణాలు చేసుకోవాలో అధికారులే సమాధానం ఇవ్వాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు పునరాలోచన చేసి లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa