ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడుకు కోసం వెతికిన తండ్రికి నిరాశ.. అసలు ఎం జరిగిందంటే..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 12:13 PM

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి 16 వ నంబరు జాతీయ రహదారిపై గత ఏడాది డిసెంబర్ 27 న గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన వ్యక్తి విశాఖపట్టణంలోని సీతమ్మధారకు చెందిన బంగారురాజు ( 30 ) గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన మేరకు డిసెంబర్ 26వ తేదీన విశాఖ నుంచి బంగారురాజు విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు. కొంతకాలంగా ఆయనకు భార్యతో వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మంగళగిరికి వచ్చేసినట్లు తెలుసుకున్నారు. ఆమెను ఒక్కసారి కలిసి వెళదామని డిసెంబర్ 27 న అమ్మవారి దర్శనానంతరం మంగళగిరి వెళ్లారు. ఆమె కనిపించకపోవడంతో అక్కడే ఉన్న తన బావమరిదిని కలిసి అమ్మవారి ప్రసాదం ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో తాడేపల్లి చేరుకున్న బంగారురాజును బైపాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని పూడ్చి వేశారు.


ఇదిలా ఉండగా ఇంటి నుంచి వెళ్లిన బంగారురాజు నాలుగు రోజులైనా తిరిగి రాకపోవడంతో విశాఖలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో అతడి తండ్రి కొండలరావు ఫిర్యాదు చేశారు. అనంతరం తన బంధువుతో కలిసి విజయవాడకు వెళ్లి పరిసర ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో విచారిస్తూ పోలీసు కంట్రోల్ రూమ్ లోని ఓ అధికారిని కలిశారు. అతని వద్ద తన కొడుకు మృతదేహం ఫొటో ఉండటం చూసి బోరున విలపించారు. వివరాలు సేకరించి అక్కడి నుంచి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించగా మృతుడి సంచి, ఇతర వస్తువులు చూపించారు. మృతదేహం ఖననం చేసిన ప్రదేశానికి తండ్రి కొండలరావును తీసుకువెళ్ళి చూపించారు. తండ్రి కొండలరావు కుమారిడికి ఇష్టమైన అల్పాహారం, తాగునీరు ఉంచి బరువెక్కిన గుండెతో నివాళులర్పించారు. పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగించే తన కొడుకు లేడనే విషయాన్ని వృద్ధుడైన తండ్రి కొండలరావు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని తెలుసుకోమని పోలీసులను కోరగా, జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు లేనందున ప్రయోజనం లేకుండా పోయిందని ఆ వృద్ధ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa