ఒకే వ్యక్తిపై కరోనా పదే పదే దాడిచేస్తోందంటే కాస్త ఆలోచించాల్సిందే. అలాంటి ఘటనే టర్కీలో చోటు చేసుకొంది. టర్కీలో ఓ వ్యక్తి కొన్ని నెలలుగా ఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కోవిడ్ పాజిటివ్‌గానే ఫలితం రావడంతో ఇంట్లో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 14 నెలలుగా ఉంటున్నాడు. ఇప్పటికి 78 సార్లు వైరస్ పరీక్షలు చేయగా అన్ని సార్లు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఎవరిని కలవకుండా ఒంటరిగా గడుపుతున్నాడు. లుకేమియా రోగి అయిన ముజాఫర్ కయాసన్‌కు నవంబర్ 2020లో మొదటిసారిగా కోవిడ్ వైరస్ సోకింది. దాంతో ఆస్పత్రిలో చేరాడు. రెండు వారాల తర్వాత డిశ్చార్జ్ అయి ఇస్తాంబుల్‌లోని సరియర్ జిల్లాలోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ట్రీట్‌మెంట్ కంటిన్యూ చేశాడు. కొన్ని రోజులకే అతనిలో వైరస్ లక్షణాలన్నీ పోయాయి. మళ్లీ టెస్ట్ చేస్తే మాత్రం పాజిటివ్ అనే వచ్చింది. చేసేదేం లేక మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. తర్వాత చాలాసార్లు టెస్ట్ చేయించగా ఫలితం మాత్రం పాజిటివ్ అనే వచ్చింది. ఇక లాభం లేదని తిరిగి ఇంటికి వచ్చేసి ఒంటరిగా ఉండడం మొదలుపెట్టాడు. పోషకాహారం తీసుకుంటూ, మందులు వాడుతున్నాడు. అయినా రిజల్ట్ మాత్రం మారలేదు. ఇలా 14 నెలలుగా ఐసోలేషన్‌లోనే ఉంటూ అవస్థలు పడుతున్నాడు. ఇంట్లో వాళ్లను కలుసుకోలేక, బంధువులు, స్నేహితులతో మాట్లాడే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ముజాఫర్ కయాసన్ లుకేమియా రోగి కావడంతో అతడి రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయక ఇలా అవుతుందని అక్కడి వైద్యులు అంటున్నారు. కరోనా వైరస్లపై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి కావడం లేదని అందుకే అతడికి కరోనా నెగెటివ్ రావడం లేదని అంటున్నారు. ముజాఫర్ ఎప్పుడు బయటపడతాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికి ముజాఫర్ తొమ్మిది నెలలు ఆస్పత్రిలో, ఐదు నెలలు ఇంట్లో ఐసోలేషన్‌లో గడిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa