ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రమశిక్షణతో ఇష్టపడి కష్ట పడితే విజయాలు మీ వశమౌతాయి: ఉపరాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 01:46 PM

కృష్ణా జిల్లా: సమాజంలోని అన్ని రంగాల్లో పోటీ అనివార్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో తమ తమ రంగాల్లో నైపుణ్యాన్ని సముపార్జించుకుని, క్రమశిక్షణతో, ఇష్టపడి కష్టపడడం ద్వారా విజయాలు సాధ్యమౌతాయని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు యువతకు దిశానిర్దేశం చేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ లో వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ పొందుతున్న వారిని ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, కార్యక్రమ అనంతరం వారికి సర్టిఫికేట్ లను ప్రదానం చేశారు. ప్రతిభకు మారుపేరైన భారతీయ యువత ఉన్నతమైన కలలతో, ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో నైపుణ్యాన్ని సాధించడం ద్వారా అంతర్జాతీయంగా అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సూచించారు.


యువత ఉపాధి కోసం ప్రభుత్వాల మీద మాత్రమే ఆధారపడ కూడదన్న ఉపరాష్ట్రపతి, వివిధ రంగాల్లో అనేక అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధిని అందించడం ద్వారా వారికి బంగారు భవిష్యత్తును అందించడమే గాక, వారు స్వయం ఉపాధి ద్వారా సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ రంగం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


భారతదేశానికి ప్రత్యేకమైన యువశక్తిని నవభారత నిర్మాణంలో సారధ్యం వహించే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోదీ దృష్టి పెట్టడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా యువత అభివృద్ధి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. దీని కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. యువతరం మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలని సూచించిన ఉపరాష్ట్రపతి, ఉన్నతమైన విలువలను అలవరచుకోవాలని సాటి వారి పట్ల సహానుభూతితో వ్యవహరించాలని సూచించారు. భారతీయ సంస్కృతిలో మూల భాగమైన నలుగురితో పంచుకోవడం, నలుగురి మేలు పట్ల శ్రద్ధ వహించడాన్ని (షేర్ అండ్ కేర్) యువత తమ జీవనసూత్రంగా అలవరచుకోవాలని దిశానిర్దేశం చేశారు.


భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవలసిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, యువత మూలాల్లోకి తిరిగి రావాలని సూచించారు. ఆరోగ్య కరమైన ఆహరం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి మీద దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో సాయంత్రం నడక సమయంలో వివిధ జాతులకు చెందిన పక్షులన్నీ కలిసి ఆహారాన్ని స్వీకరిస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, సమాజంలో వ్యక్తుల మధ్యకూడా అదే విధమైన ఏకత్వం రావాలని ఆకాంక్షించారు. ఈ దిశగా వివక్షలకు తావులేని భారతదేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు.


ఈ కార్యక్రమానికి ముందు విజయవాడకు చెందిన ఔత్సాహిక నృత్యకళాకారిని శ్రీమతి ఏల్చూరి స్నేహశర్మ నాట్యాన్ని ఉపరాష్ట్రపతి తిలకించారు. ఆమె ప్రదర్శించిన శ్రీ విఘ్నరాజమ్ భజే, త్రిపుర సంహారం, కాళీయ మర్ధనం ఘట్టాలు ఎంతో ఆనందాన్ని పంచాయని తెలిపారు. ప్రదర్శిస్తున్న కళ మీదే శరీరం, దృష్టి, మనసు కేంద్రీకరించడం ద్వారా రససిద్ధి లభిస్తుందన్న అభినయ దర్పణంలోని మూల శ్లోకాన్ని ఉదహరించిన ఉపరాష్ట్రపతి, ఈ సూత్రం నాట్యానికేగాక, జీవితంలో ప్రతి సందర్భానికి వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఇతర ట్రస్టీలు, శిక్షణార్ధులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa