ఉక్రెయిన్ పై రష్యా దాడులపై ఐక్య రాజ్యసమితి తీవ్ర ఆందోళన చేసింది. ఉక్రెయిన్ లో సెకండ్‌కో బిడ్డ శరణార్థిగా మారుతోంది అని ఆవేదన వ్యక్తంచేసింది. యుద్ధం మిగిల్చే దు:ఖాన్ని చరిత్ర మోస్తూనే ఉంటుంది. ఆ వ్యథ తరతరాలను తడుముతుంది. ఎందుకంటే యుద్ధం అంటే నెత్తుటేరులు.. కన్నీటి ధారలు.. ఇదే విషయం ఉక్రెయిన్‌ను చూస్తే మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. తల్లులకు బిడ్డలు, బిడ్డలకు తల్లులు దూరమై ఉక్రెయిన్ అల్లాడుతోంది. అమాయక పౌరులు ప్రాణాలను కోల్పోవడమే కాదు.. కొంతమంది ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇంకొందరు క్షతగాత్రులై రోధిస్తున్నారు. ఎంతోమంది చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఇంకో విషాధకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఒక సెకండ్‌కు ఓ బిడ్డ శరణార్థిగా మారినట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఫిబ్రవరి 24 నుంచి రష్యా మొదలుపెట్టిన దాడుల్లో 1.4 మిలియన్ల మంది పిల్లలు ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లారు. అంటే ఒక సెకండ్‌కు దాదాపు ఒక బిడ్డ శరణార్థిగా మారినట్టు ఐక్యరాజ్య సమితి మంగళవారం తెలిపింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ నుంచి వచ్చిన తాజా గణాంకాల ప్రకారం ఉక్రెయిన్ నుంచి మూడు మిలియన్లకు పైగా ప్రజలు పారిపోగా అందులో సగం మంది పిల్లలే ఉన్నారు. " ఉక్రెయిన్‌లో గత 20 రోజులుగా ప్రతిరోజూ 70 వేల కంటే ఎక్కువ మంది చిన్నారులు శరణార్థులుగా మారారు" అని యూనిసెఫ్ అధికార ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ వెల్లడించారు. యుద్ధం, సంక్షోభం కారణంగానే ఏం చేయాలో తెలియని పిల్లలు వారి ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇంటికి దూరమై, తల్లిదండ్రులకు దూరమైపోతున్నారు. సరిహద్దు దేశాలకు చేరుకునే ఉక్రేనియన్ పిల్లలు తమ కుటుంబాన్నికోల్పోవడం, హింస, లైంగిక దోపిడీ, అక్రమ రవాణాకు గురయ్యే ప్రమాదం ఉందని ఎల్డర్ అభిప్రాయపడ్డారు. ఆ చిన్నారుల భద్రత ఇవ్వడం చాలా అవసరమని ఆయన అంటున్నారు. అయితే ఈ వేదనను మిగిలిస్తోన్న యుద్ధానికి ముగింపు ఎక్కడో తెలియడం లేదు. రష్యా తన బలగాలతో ఉక్రెయిన్ నగరాలపై బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది. నగరాలను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా దళాలు కదులుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. చర్చల ద్వారా శాంతికి దారులు పడతాయనుకుంటే.. ఇరు దేశాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.