చైనాను వైరస్ వీడటంలేదు. నాడు కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తే మళ్లీ నేడు ఒమిక్రాన్ వైరస్ అలాగే చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తగ్గుముఖం పట్టి ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటుపడుతుండగా.. కోవిడ్-19 పుట్టిల్లు చైనాలో మహమ్మారి మరోసారి విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది. ‘స్టెల్త్ ఒమిక్రాన్’ రూపంలో మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. మార్చి 2020 తర్వాత అత్యధికంగా రోజువారీ కేసులు చైనాలో నమోదవుతున్నాయి. చైనాలో మంగళవారం అత్యధికంగా 5,280 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. ముందు రోజు సోమవారం కంటే రెట్టింపు కేసులు కావడం గమనార్హం. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ ఒక దారిలో వెళ్తుంటే చైనా మాత్రం జీరో కోవిడ్ వ్యూహాన్ని గత రెండేళ్లుగా అనుసరిస్తోంది. డ్రాగన్‌కు కొత్త వేరియంట్ దడ పుట్టిస్తోంది. వరుసగా ఆరు రోజుల నుంచి వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డేటా ప్రకారం ఆదివారం 1,437 కేసులు నమోదుకాగా.. సోమవారానికి ఇవి 3,607కి చేరాయి. మంగళవారం ఏకంగా 5,280 కేసులు నమోదయ్యాయి. చైనాలో 2020 ఫిబ్రవరి 12న అత్యధికంగా దాదాపు 15 వేల కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాతి నుంచి కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేసులు భారీగా పెరుగుతుండటంతో చైనా 13 పెద్ద నగరాలను సీల్ చేసి.. 3 కోట్ల మందికి పైగా ప్రజలను ‘లాక్‌డౌన్’లో ఉంచింది. అత్యవసరమైనవి తప్పా మిగతా పరిశ్రమలు మూసివేసి, ప్రజారవాణాను నిలిపివేశారు. జిలిన్, చాంగ్‌చున్, షెన్‌ఝెన్, షాంఘై, లాంగ్‌ఫాంగ్ నగరాల్లో ఆంక్షలు విధించారు. విస్తృతస్థాయిలో ప్రజలకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజధాని బీజింగ్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బీజింగ్, షాంఘైలకు విమాన ప్రయాణాలు రద్దు చేశారు. సమీప భవిష్యత్తులో లాక్‌డౌన్‌లను సడలించడం అసాధ్యమని చైనా అగ్రశ్రేణి వైద్య నిపుణుడు ఝాంగ్ వెన్‌హాంగ్ చెబుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కళ్లూ వీలైనంత వేగంగా బూస్టర్ డోస్ సహా వ్యాక్సినేషన్ వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. చైనాలోని దాదాపు 80 శాతం మంది జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కానీ, పొరుగున ఉన్న హాంకాంగ్‌లో మరణాలు రేటు అధికంగా ఉండటంతో చైనా కలవర పడుతోంది. ఈశాన్య ప్రావిన్సులు జిలిన్‌లో 8,200 మంది ఆస్పత్రిలో చేరినట్టు అధికారులు తెలిపారు. మంగళవారం అక్కడ 3,000కిపైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఒక్క కేసు బయటపడినా లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతోంది. కొవిడ్-19 విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో కట్టడి చర్యలు, వ్యాక్సిన్ పంపిణీ, వైరస్‌తో కలిసి జీవించే వ్యూహంతో ప్రపంచ దేశాలు ముందుకెళుతున్నాయి. కానీ చైనా మాత్రం కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే జీరో కొవిడ్ వ్యూహాన్నే నమ్ముకుంది. తాజాగా డెల్టాతోపాటు ఒమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరగడంతో డ్రాగన్ దేశం ఆందోళన చెందుతోంది. చైనాను వణికిస్తున్న ‘స్టెల్త్ ఒమిక్రాన్’ గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో శోధిస్తున్నారు. అత్యధిక సాంక్రమిక శక్తి ఉన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపవర్గం ‘BA.2’ను ‘స్టెల్త్ ఒమిక్రాన్’గా పిలుస్తున్నారు. దీనిపై బ్రిటన్ ఆరోగ్య, భద్రత సంస్థ (యూకేహెచ్‌ఎస్‌ఏ) పరిశోధనలు కొనసాగుతున్నాయి. దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ కంటే ఇది 1.5 రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల్లో ‘స్టెల్త్ ఒమిక్రాన్’నిర్దిష్టంగా గుర్తించడానికి అవసరమయ్యే స్పైక్ ప్రొటీన్లలోని కొన్ని ఉత్పరివర్తనాలు లేవు. కొవిడ్ కట్టడి వ్యూహాలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న దక్షిణ కొరియాలో ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కల్లోలం రేపుతోంది. గత ఏడాది డిసెంబరు వరకు అక్కడ 6.3 లక్షల మందికి కోవిడ్ సోకగా.. మంగళవారం నాటికి ఆ సంఖ్య 72 లక్షలకు చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం రోజులుగా సగటున 3.37 లక్షల రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 293 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కొవిడ్ మరణాలు 10 వేలు దాటింది.